
సమస్యలపై పోరాడాలి
ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలు నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ తెలిపారు.
సీపీ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్
శ్రీరాంపూర్ : ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలు నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ తెలిపారు. ఆదివారం ఆయన శ్రీరాంపూర్‌లోని అభ్రహం భవన్‌లో జరిగిన సింగపూర్ గ్రామ కార్యవర్గం, కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 3 నుంచి 6 వరకు హైదరాబాద్‌లో జరిగే అఖిలభారత రైతు మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. అలాగే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై, హక్కుల కోసం సదస్సులు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు డబుల్‌బెడ్ రూం, దళితులకు 3 ఎకరాల భూమి, ఇతర డిమాండ్లపై మార్చి 11న అన్ని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా మార్చి 23న కార్మికవాడల్లో కాగడాల ప్రదర్శన నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గం కార్యదర్శి కలవేన శ్యాం, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, సహాయ కార్యదర్శి డాక్టర్ శంకర్, సింగపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు జె.నర్సింగ్, సహాయ కార్యదర్శి కొమురయ్య, నాయకులు సంఘం సదానందం, సలాది శ్రీను, రత్తయ్య, రాజయ్య, ముక్కెర శ్రీను పాల్గొన్నారు.
ఏఐవైఎఫ్ మండల సమితి సమావేశం..
ఏఐవైఎఫ్ మంచిర్యాల మండల సమితి సమావేశం ఆదివారం సీసీసీ కార్నర్‌లోని నర్సయ్య భవన్‌లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు లింగం రవి హాజరయ్యారు. జేఎన్‌యూలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. కన్హయ్యకుమార్‌పై పెట్టిన దేశద్రోహం కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు ముక్కెర శ్రీనివాస్, అజిద్, రావుల పవన్, జగన్, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ : యువజన సమస్యలపై పోరాడాలని ఏఐవైఎఫ్ సమాఖ్య జిల్లా నిర్మాణ బాధ్యుడు కలవేని శ్యాం అన్నారు. ఆదివారం సీసీసీలోని నర్సయ్య భవన్‌లో నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. యూనివర్సిటీ విద్యార్థి కన్హయ్యపై పెట్టిన దేశ ద్రోహం కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 23న నిరసన, 29న జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా, మార్చి 23న భగత్‌సింగ్ వర్ధంతి సభలు నిర్వహించాలని తీర్మానం చేశారు. జిల్లా కార్యదర్శి కారుకూరి నగేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఆఫీసు బేరర్స్ బి.ఉపేందర్, కె.భానేశ్, లింగం రవి, ఎన్.వెంకటేశ్వర్, ఎస్.దేవేందర్ పాల్గొన్నారు.