ఉప్పల్‌ పీహెచ్‌సీకి ‘ఎన్‌క్వాస్‌’ దక్కేనా?  

Officials Visiting Uppal Hospital Today - Sakshi

నేడు పరిశీలనకు రానున్నకేంద్ర బృందం

పోటీలో ఉప్పల్,ముల్కనూర్‌ పీహెచ్‌సీలు

కమలాపూర్‌(హుజూరాబాద్‌): వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలోని ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ నాణ్యతా ప్రమాణాల హామీ సంస్థ (ఎన్‌క్వాస్‌) గుర్తింపు పొందేం దుకు పోటీపడుతోంది. ఈనెల 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు వైద్య, ఆరోగ్య శాఖ కేంద్ర బృందం సభ్యులు ఉప్పల్‌ పీహెచ్‌సీ పరిశీలనకు రానున్నారు.

ఈ సందర్భంగా పీహెచ్‌సీలో ఔట్‌ పేషెంట్లు, ఇన్‌ పేషెంట్లు, ల్యాబోరేటరీ సర్వీసెస్, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్, ప్రసవాలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు మాతా, శిశు సంరక్షణ, అంధత్వ నివారణ, టీకాలు, హెచ్‌ఐవీ, టీబీ, ఫైలేరియా, కుష్టు, మలేరియా తదితర విభాగాల్లో పనితీరు, పురోగతిని కేంద్ర బృంద సభ్యులు పరిశీలిస్తారు.

అదేవిధంగా ఆస్పత్రిలో నాణ్యతా ప్రమాణాలు, రోగులకు అందించే వైద్యసేవలు, ఆస్పత్రి ఆవరణ, పరిసరాల పరిశుభ్రత, ఆస్పత్రి రికార్డుల నిర్వహణ తదితరాలన్నింటినీ ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం పరిశీలించి, వైద్యసేవలు, ఇతరత్రా పలు అంశాలకు సంబంధించి ఆస్పత్రి సిబ్బందిని ఇంటర్వ్యూ చేయనున్నారు.

ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు..

ఉప్పల్‌ పీహెచ్‌సీ ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. గత ఫిబ్రవరి 5న ఉప్పల్‌ పీహెచ్‌సీని వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర బృందం పరిశీలించి రాష్ట్రస్థాయి ఉత్తమ పీహెచ్‌సీగా ఎంపిక చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 19న ఉప్పల్‌ పీహెచ్‌సీ స్వచ్ఛభారత్‌ కింద జిల్లా స్థాయిలో ఉత్తమ పీహెచ్‌సీగా కాయకల్ప అవార్డుకు ఎంపికైంది.

పోటీలో 11 పీహెచ్‌సీలు..

ఎన్‌క్వాస్‌ గుర్తింపుతో జాతీయ స్థాయిలో ఉత్తమ పీహెచ్‌సీగా ఎంపికయ్యేందుకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌ పీహెచ్‌సీ పోటీ పడుతున్నాయి. ఈరెండు పీహెచ్‌సీలతో పాటు నిర్మల్‌ జిల్లా నుంచి సోనా, నల్లగొండ జిల్లా నుంచి శౌలిగౌరారం, నిజామాబాద్‌ జిల్లా నుంచి చౌటుప్పల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఏకంగా ఆరు పీహెచ్‌సీల చొప్పున మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పీహెచ్‌సీలు పోటీ పడుతున్నాయి.

ఎన్‌క్వాన్‌ గుర్తింపు దక్కితే...

జాతీయ స్థాయిలో ఎన్‌క్వాస్‌ గుర్తింపు దక్కిన పీహెచ్‌సీకి ఏడాదికి రూ.3లక్షల చొప్పున మూడేళ్ల పాటు మొత్తం రూ.9 లక్షల అభివృద్ధి నిధులు అదనంగా రానున్నాయి. ఈ నిధులతో ఆస్పత్రిలో మరిన్ని వసతులు కల్పించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం కలుగుతుంది.ఆస్పత్రిని 

మరింత అభివృద్ధి చేసుకోవచ్చు

స్వచ్ఛత, వైద్య సేవల్లో ఇప్పటివరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాం. జాతీయ స్థాయిలో కూడా ఎన్‌క్వాస్‌ గుర్తింపు వస్తే ఆస్పత్రిని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవడంతోపాటు రోగులకు మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందించే అవకాశం దక్కుతుంది. కేంద్ర బృందం రావడమంటే మా పనితీరుకు పరీక్షగా భావిస్తున్నాం.

– డాక్టర్‌ రాకేష్‌కుమార్, వైద్యాధికారి ఉప్పల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top