రెండు నెలలుగా అందని పౌష్టికాహారం | Nutrition preposterous from two months | Sakshi
Sakshi News home page

రెండు నెలలుగా అందని పౌష్టికాహారం

Sep 4 2014 11:57 PM | Updated on Sep 19 2018 8:32 PM

ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సరఫరా కావడం లేదు.

 ఘట్‌కేసర్ టౌన్: ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సరఫరా కావడం లేదు. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. మాతా, శిశు మరణాలను నివారించేందుకు ఆరేళ్లలోపు చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందజేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన పౌష్టికాహార భోజన పథకం మండలంలో సక్రమంగా అమలుకు నోచుకోవడంలేదు.

 నీరుగారుతున్న పథకం
 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నిత్యం చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు ఆరు నెలల వరకు పౌష్టికాహారాన్ని అందించాలి. రోజూ మధ్యాహ్నం వారికి అన్నం, పప్పు, ఆకు కూరలతో పాటు గుడ్డు, పాలు అందజేయాలి. కాగా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలలుగా పౌష్టికాహారం అందడం లేదు. గర్భిణులకు రోజు 40 గ్రాముల పప్పు, 18.2 గ్రాముల మంచి నూనె, చిన్నారులకు రోజు 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల మంచి నూనె, వారానికి ఒక్కసారి20 గ్రాముల కుర్‌కురేలు రెండు నెలలుగా సరఫరా కావడం లేదు.

పౌష్టికాహారంలో ముఖ్యమైనటువంటి  నూనె, పప్పు తదితర పదార్థాల పంపిణీ లేకపోవడంతో బాలింతలు, గర్భిణులు బియ్యం తీసుకోవడానికి విముఖత చూపుతున్నారు, నిత్యం అందే పౌష్టికాహారం అందకపోవడంతో చాల మంది చిన్నారులు ఇంటికే పరిమితం కావడంతో మాతా, శిశు మరణాలను తగ్గించి రేపటి పిల్లలను శారీకంగా, మానసికంగా దృడంగా ఉండాలన్న ప్రభుత్వం ఆశయానికి గండి పడుతోంది.

గర్భిణులు, బాలింతలు, చిన్నారులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సరఫరా చేయాలని కోరుతున్నారు. కాగా.. స్టాకు లేకపోవడం, సరఫరా చేసేందుకు నియమించిన కాంట్రాక్టర్ కొత్త కావడంతో సరఫరాలో ఆలస్యం జరిగిందని తక్షణమే సరఫరా చేస్తామని ఐసీడీఎస్ హయత్‌నగర్ ప్రాజెక్టు ఇన్‌చార్జి లలితకుమారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement