‘అనుసంధానం’..అగమ్యగోచరం..!  | Not conclude on the connectivity of Godavari-Cauvery rivers | Sakshi
Sakshi News home page

‘అనుసంధానం’..అగమ్యగోచరం..! 

Apr 19 2019 1:57 AM | Updated on Apr 19 2019 1:57 AM

Not conclude on the connectivity of Godavari-Cauvery rivers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియలో ఎలాంటి ముందడుగు పడటం లేదు. వివిధ రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు, స్వరాష్ట్ర ప్రయోజనాలు కాపాడాకే మిగులు జలాలు తరలించాలన్న విధానాన్ని పలు రాష్ట్రాలు వ్యక్తం చేస్తుండటంతో అనుసంధాన ప్రక్రియ మూలనపడుతోంది. అదీగాక జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై రాష్ట్రాలు గుర్రుగా ఉండటం సైతం అనుసంధానానికి అడ్డుగా మారుతోంది. అకినేపల్లి అని ఒకమారు, జనంపేట్‌ అని మరోమారు, ఇచ్చంపల్లి అంటూ ఇంకోమారు మాటలు చెబుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు.  

నాలుగు ప్రతిపాదనల్లో ఏదీ తేలలేదు..? 
ఒడిశాలోని మహానది మొదలు తెలంగాణ, ఏపీ లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ, తమిళనాడు, కర్ణాటకలోని కావేరి వరకు నదుల అనుసంధానాన్ని చేపట్టాలని భావిస్తున్న కేంద్రం, ఇప్పటికే దానికి అనుగుణంగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మహానదిలో 360 టీఎం సీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలున్న దృష్ట్యా, ఇందులో 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని మొదట ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గోదావరిలో తెలంగాణకు హక్కుగా 954 టీఎంసీల కేటాయింపు ఉం దని, ఉమ్మడి రాష్ట్రంలో ఆ మేరకు నీటిని వాడు కునే అవకాశం దక్కలేదని తెలిపింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు సైతం చేపట్టడంతో ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తెలంగాణకు 1,600 టీఎంసీలు అవసరమని తెలిపింది. ఈ నీటిని పక్కనపెట్టి, అంతకుమించి నీటి లభ్యత ఉంటే దానిని నదుల అనుసంధానం ప్రక్రియకు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఎన్‌డబ్ల్యూడీఏ జనం పేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూ సేకరణను తగ్గించేలా పైప్‌లైన్‌ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. దీన్ని తెలంగాణ తిసర్కరించింది.దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది.

ఇచ్చంపల్లి(గోదావరి)– నాగార్జునసాగర్‌(కృష్ణా) ప్రాజెక్టులను అనుసంధానించాలని, దీనికి మూసీ రిజర్వాయర్‌ను వినియోగించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి తెలంగాణ సాను కూలంగా ఉంది. దీని ద్వారా రాష్ట్ర పరిధిలో కనిష్టంగా 18 నుంచి 20లక్షల ఎకరాల మేర సాగు జరుగుతుందని చెబుతోంది.దీనిపై ఇప్పటివరకు ఎన్‌డబ్ల్యూఏ ఎటూ తేల్చలేదు. దీంతో పాటు ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి అను కూలత లేనిపక్షంలో ఇప్పటికే నిర్మాణం జరుగుతున్న తుపాకులగూడెం ద్వారా అయినా గోదావరి నీటిని తరలించే ప్రతిపాదనకు తెలంగాణ సమ్మతి తెలుపుతున్నా ఎన్‌డబ్ల్యూడీఏ నుంచి సానుకూలత లేదు. ఇదిలా ఉంటే కర్ణాటక, తమిళనాడు ఎన్నికల ప్రచా రంలో బీజేపీ మాత్రం గోదావరి–కావేరీ నదుల అనుసంధా నం చేసి తీరుతామని, ఆయా రాష్ట్రాల నీటి అవ సరాలు తీరుస్తామని హామీలు ఇచ్చింది. కేంద్ర జల వనరుల శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. దీనిపై ముందడుగు మాత్రం పడలేదు. ప్రస్తుతం కేంద్రం నియమిం చిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీయై రాష్ట్రాలతో చర్చిస్తేనే దీనిపై అడుగు ముందుకు పడనుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement