3 జిల్లాలకు నాన్‌–కేడర్‌ కలెక్టర్లు | Sakshi
Sakshi News home page

3 జిల్లాలకు నాన్‌–కేడర్‌ కలెక్టర్లు

Published Thu, Feb 28 2019 4:10 AM

Non cadre collectors for 3 districts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ఏర్పడిన రెండు జిల్లాలతోపాటు వికారాబాద్‌ జిల్లాకు కొత్త కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నాన్‌ కేడర్‌ అధికారులకు పదోన్నతులిస్తూ ఈ నియామకాలు చేపట్టారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషాకు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. నల్లగొండ జిల్లా జేసీగా ఉన్న సి.నారాయణరెడ్డిని కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా కలెక్టర్‌గా, మహబూబ్‌నగర్‌ జేసీ ఎస్‌.వెంకటరావును మరో కొత్త జిల్లా నారాయణపేట కలెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్లుగా నియమితులైన ముగ్గురూ నాన్‌ ఐఏఎస్‌ అధికారులే.

ప్రస్తుతం వీరు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ (ఎస్‌జీడీసీ) హోదాను కలిగి ఉన్నారు. వీరికి ఐఏఎస్‌ హోదా కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించిందని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు పెరిగిన విషయం తెలిసిందే. పెరిగిపోయిన జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించేందుకు సరిపోయే సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు రాష్ట్రంలో లేరు. కొందరు ఐఏఎస్‌లు కొన్నేళ్లుగా అప్రధాన్య పోస్టుల్లో కొనసాగుతున్నారు. పోస్టింగ్‌ల విషయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ ఐఏఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టి నాన్‌ ఐఏఎస్‌ అధికారులను కలెక్టర్లుగా నియమించడం గమనార్హం. ఐఏఎస్‌ కాని వారిని కలెక్టర్లుగా నియమించడం ఇదే తొలిసారి అని, ఇంతకు ముందు నాన్‌ ఐపీఎస్‌ అధికారులను జిల్లా ఎస్పీలుగా నియమించడంతో ఈ సంప్రదాయం ప్రారంభమైందని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.

బి.జనార్దన్‌ రెడ్డికివిద్యాశాఖ బాధ్యతలు
విద్యాశాఖ కార్యదర్శిగా బి.జనార్దన్‌రెడ్డి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయన పురపాలక శాఖ డైరెక్టర్‌గా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లుగా పనిచేశారు. గత కొంతకాలంగా పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 

Advertisement
Advertisement