కాకతీయ, భగీరథలతో వివక్ష దూరం 

No Discrimination will be with Kakatiya and Bhagiratha projects - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్నప్పటికీ 70 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతాలు తాగునీటికి ఇబ్బందులు పడుతూనే ఉండేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషి అన్నారు. మిషన్‌ కాకతీయ, భగీరథలతో ఈ పరిస్థితిలో మార్పు వస్తోందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రెండు పథకాల వల్ల సాగునీటి సమర్థ నిర్వహణతోపాటు కుల, మత, లింగ వివక్షలు లేకుండా అన్ని ఇళ్లకు తాగునీటిని అందించడం సాధ్యమైందని అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్, ట్రయినింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఈపీటీఆర్‌ఐ)లో సోమవారం జరిగిన వర్క్‌షాప్‌నకు సీఎస్‌ ఎస్‌.కె.జోషి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నీటి యాజమాన్య పద్ధతులు, లింగ వివక్ష లేమి అన్న అంశాలపై సాగునీటి ఇంజనీర్ల కోసం ఏర్పాటైన ఈ కార్యక్రమంలో సీఎస్‌ మాట్లాడుతూ.. నీటి యాజమాన్యం విషయంలో మహిళల హక్కులను కాపాడటం ఎంతైనా అవసరమని అన్నారు. ప్రతీ ఇంటికి మంచినీరు అందించడమే లక్ష్యంగా మిషన్‌ భగీరథ పనులు చేపడుతున్నామని తెలిపారు. మిషన్‌ కాకతీయ ద్వారా అన్ని చెరువుల్లో పూడికతీసే బృహత్తర కార్యక్రమం చేపట్టామని వివరించారు. భవిష్యత్‌ అంతా నీటి మీదే ఆధారపడి ఉందని జెండర్, వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై టెరీ, ఈపీటీఆర్‌ఐ కలసి పనిచేస్తాయని తెలిపారు. అనంతరం ఈపీటీఆర్‌ఐలో సీఎస్‌ మొక్కలు నాటారు.  

మహిళలకు ప్రాధాన్యం.. 
తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న ‘ద ఎనర్జీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ప్రో వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ రాజీవ్‌సేథ్‌ మాట్లాడుతూ.. నీటి యాజమాన్యం విషయంలో మహిళలకు ప్రాధాన్యం కల్పించడం అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడో మొదలైందని, దేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే మొదలవుతోందన్నారు. తెలంగాణలో ఏర్పాటైన ఈ రెండు రోజుల వర్క్‌షాప్‌ ఆ దిశగా వేసిన తొలి అడుగు అని తెలిపారు. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ బి.కల్యాణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ నీటి సమస్యల పరిష్కారానికి ఇంజనీర్లు వినూత్నమైన పరిష్కారాలను ఆవిష్కరించాలని సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల వారినీ కలుపుకుపోవడం ద్వారా లింగ వివక్షను అధిగమించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీఈ డబ్ల్యూఆర్‌ఎం వార్మ్‌ చీఫ్‌ అకడమిక్‌ ఆఫీసర్‌ ఐయాన్‌ రీడ్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విశాల్‌ నరేన్, ప్రొఫెసర్‌ సుచిత్రాసేన్, సోల్‌ ఫౌండర్‌ డాక్టర్‌ జస్వీన్‌ జైరత్, ఇరిగేషన్‌ అండ్‌ క్యాడ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top