నగరంలోనైట్ షెల్టర్లు | Night shelters in the city | Sakshi
Sakshi News home page

నగరంలోనైట్ షెల్టర్లు

Sep 20 2014 4:18 AM | Updated on Oct 17 2018 5:37 PM

నగరంలోనైట్ షెల్టర్లు - Sakshi

నగరంలోనైట్ షెల్టర్లు

నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి తోడుగా ఉండేందుకు వచ్చిన వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం.

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి తోడుగా ఉండేందుకు వచ్చిన వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు రాత్రి వేళల్లో కనీసం నిలువ నీడ లేక.. ఆస్పత్రి ఆవరణలు, సమీపంలోని ఫుట్‌పాత్‌లు, పార్కులు, రోడ్డు డివైడర్లపై గడపాల్సిన దుస్థితి.అలాంటి వారికి నీడనిచ్చేందుకు నైట్ షెల్టర్ల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఎంపిక చేసిన ఏడు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద రానున్న చలికాలంలోగా వాటి ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

గత ఏడాది చలికాలంలో ఈ తరహా బాధితుల వేదనపై ‘సాక్షి’లో వెలువడిన కథనానికి అప్పట్లోజీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ స్పందించారు. బంజారాహిల్స్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద నైట్‌షెల్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. దాని వల్ల ఎందరికో మేలు జరుగుతోంది. మిగతా ఆస్పత్రుల వద్ద పేషెంట్లు, తోడుగా వచ్చే వారు ఉండేందుకు నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు.

ఆస్పత్రుల ఉన్నతాధికారులతో చర్చించి, వారిని ఒప్పించారు. మరి కొద్ది రోజుల్లో  చలికాలం రానుండటంతో ఆలోగా ఆస్పత్రుల వద్ద నైట్ షెల్టర్లు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. దీనికి నివేదికలు రూపొందించాల్సిందిగా కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తూ టెండర్ ప్రకటన జారీ చేశారు. ఒక్కో ఆస్పత్రి వద్ద డిజైన్‌కు రూ.69 వేల వంతున ఏడు ఆస్పత్రులకు మొత్తం రూ.4.83 లక్షలకు సేవలందించేందుకు ముందుకొచ్చిన సంస్థకు పనులు అప్పగించారు. ఈ సంస్థ నుంచి నివేదిక అందగానే నైట్‌షెల్టర్ల పనులు ప్రారంభించనున్నారు.
 
అమలుకు నోచని ‘సుప్రీం’ఆదేశాలు..

ఐదు లక్షల జనాభా దాటిన నగరాల్లో ఐదు లక్షల మందికి ఒక నైట్‌షెల్టర్ చొప్పున ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు చాలా కాలం క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ఆ లెక్కన నగరంలో దాదాపు వంద నైట్‌షెల్టర్లు ఉండాలి. కానీ, ఇప్పటి వరకు 14 మాత్రమే ఏర్పాటు చే శారు. వాటిలోనూ దాదాపు పది మాత్రమే సక్రమంగా నడుస్తున్నాయి. నగరానికి దూరంగా ఎక్కడెక్కడో వాటిని ఏర్పాటు చేయడంతో వినియోగించుకునే వారు లేక కొన్నింటిని మూసేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement