హైవే పక్కన హోటళ్లలో ఫాస్టాగ్‌ విక్రయం

NHAI Decided To Sell Fastag Tag At Road Side Hotels - Sakshi

పండుగ రద్దీ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం

విజయవాడ రహదారిలో 6 హోటళ్లలో అమ్మకం

సాక్షి, హైదరాబాద్‌: టోల్‌ప్లాజాల వద్ద సంక్రాంతి సమయంలో అయోమయం నెలకొనే పరిస్థితి ఉండటంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అప్రమత్తమయ్యారు. సంక్రాంతి రద్దీ మొదలయ్యే నాటికి వీలైనన్ని ఫాస్టాగ్‌లు విక్రయించాలని నిర్ణయిం చారు. ఇప్పటికే టోల్‌ప్లాజాల వద్ద పెద్ద సంఖ్యలో కౌంటర్లు తెరిచి ఫాస్టాగ్‌లను విక్రయిస్తున్నారు.  జాతీయ రహదారిపై ముఖ్యమైన హోటళ్లలో ఫాస్టాగ్‌ విక్రయ కౌంటర్లు తెరిచారు. విజయవాడ రహదారిలో రద్దీ ఎక్కువగా ఉంటున్నందున ఆ రోడ్డులోని 6 హోటళ్లలో విక్రయాలు ప్రారంభించారు.

బుధవారం నుంచి వాటి అమ్మకాలు మొదలయ్యాయి. ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్‌ ఈ హోటళ్లలోని కౌంటర్లను పరిశీలించి, హోటళ్లకు వచ్చే వాహనదారులతో మాట్లాడి ఫాస్టాగ్స్‌ కొనుగోలు చేసేలా చైతన్యపరచాలన్నారు. ఇక్కడ ఫాస్టాగ్‌ విక్రయాలు ఆశాజనకంగా ఉంటే మరిన్ని హోటళ్లలో వాటిని ప్రారం భించాలని నిర్ణయించారు. ఫాస్టాగ్‌ లేకుంటే సం క్రాంతి ప్రయాణం ఇబ్బందిగా ఉంటుందని, దా న్ని నివారించేందుకు వెంటనే ట్యాగ్‌ తీసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. జాతీయ రహదారుల వెంట ఆ మేరకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం లేన్లు ఇలా..
ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల వద్ద 25 శాతం లేన్లు హైబ్రీడ్‌ వేలుగా ఉన్నాయి. వాటిల్లో ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలతోపాటు లేని వాటిని కూడా అనుమతిస్తున్నారు. 75 శాతం లేన్లు పూర్తిగా ఫాస్టాగ్‌ ఉన్నవాటికే కేటాయిం చారు. జనవరి 14 తర్వాత క్యాష్‌ లేన్‌ను ఒకటి మాత్రమే(ఒక్కోవైపు ఒకటి) ఉండనుంది. మరో పక్షం రోజులపాటు ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని ఎన్‌హెచ్‌ఏఐపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ విషయంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గడువు పెంచకుంటే సంక్రాంతి రద్దీ సమయంలో ఒక్క కౌంటర్‌ మాత్రమే క్యాష్‌ చెల్లించే వాహనాలకు అందుబాటులో ఉండనుంది. గడువు పెంచితే మరికొన్ని రోజులు ఇబ్బందులు దూరమైనట్టే. రాష్ట్రంలో ఫాస్టాగ్స్‌ ఉన్న వాహనాల సంఖ్య 81 వేలకు చేరుకుంది. గత నాలుగైదు రోజులుగా వాటి విక్రయాలు పెరిగాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top