కొత్తగా 40 మున్సిపాలిటీలు

Newly 40 municipalities - Sakshi

ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు మరింత మెరుగ్గా ప్రభుత్వ పథకాలు అందించడంతో పాటు పరిపాలనా సౌలభ్యాన్ని పెంచేందుకు రాష్ట్రంలో పురపాలక సంస్థల పరిధిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరముందని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీతో కలిపి రాష్ట్రంలో ఉన్న 74 నగర, పురపాలక సంస్థలకు అదనంగా మరో 40 పురపాలక సంస్థలను ఏర్పాటు చేసే అవకాశముందని వెల్లడించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. రామాయంపేట, బాన్సువాడ, నర్సాపూర్‌ వంటి అనేక మేజర్‌ గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా కల్పించాలని విజ్ఞప్తులొస్తున్నాయని తెలిపారు.

పురపాలక సంస్థల్లో అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని చాలా పట్టణాల మధ్యలో మేజర్‌ గ్రామ పంచాయతీలున్నాయని, దీంతో ప్రభుత్వ పథకాల అమలు, అనుమతులు, పరిపాలన పద్ధతుల్లో భిన్నత్వం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పురపాలికల ఏర్పాటుతో పాటు గ్రామ పంచాయతీలను సమీప పట్టణాల్లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో పట్టణీకరణ సమస్యలను ఎదుర్కొనే అవకాశం కలుగుతుందని చెప్పారు. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, గ్రామ పంచాయతీల విలీనం అవకాశాలపై నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శివారు గ్రామాలను పట్టణాల్లో విలీనం చేసి పట్టణీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

సాధ్యమైనన్ని ఎక్కువ పట్టణాలు
కొత్త పురపాలికల ఏర్పాటుకు 15 వేల జనాభా ఉన్న మేజర్‌ గ్రామ పంచాయతీలను గుర్తించాలని కలెక్టర్లకు కేటీఆర్‌ ఆదేశించారు. 2011 జనాభా లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 15 వేలకు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీల వివరాలు అందజేయాలని సూచించా రు. ప్రస్తుతమున్న మున్సిపాలిటీల పరిధి పెంచేందుకు 3 నుంచి 5 కి.మీల పరిధిలోని గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. గ్రామ పంచాయతీల పాలక మండలిల కాలపరిమితి వచ్చే ఏడాది జూలైలో ముగుస్తుందని, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు చట్టపరమైన చర్యలను ఆ వెంటనే ప్రారంభించాలని పురపాలక శాఖను ఆదేశించారు. పంచాయతీల హోదాను ఉపసంహరించడంతో పాటు మున్సిపాలిటీల హోదా కల్పించేందుకు ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. సాధ్యమైనన్ని ఎక్కువ సంఖ్యలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top