
కొత్తగా స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1, 2, 3 పంచాయతీలుగా వర్గీకరించేందుకు కమిటీ ప్రతిపాదనలు
ప్రస్తుతం రాబడి ప్రాతిపదికతో వివిధ గ్రేడ్లుగా కొనసాగుతున్న పంచాయతీలు
కొత్తగా జనాభా, వార్షిక రాబడి ప్రాతిపదికన పంచాయతీల వర్గీకరణ
పంచాయతీ కార్యదర్శుల విభజనపైనా కసరత్తు
రేపు పంచాయతీ కార్యదర్శుల సంఘ నేతలతో కమిషనర్ సమావేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన గ్రేడ్ల వారీగా వర్గీకరించంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ మైలవరపు శుక్రవారం పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం వార్షిక రాబడి ప్రకారం పంచాయతీలు 5 రకాలుగా ఉన్నాయి. కానీ వార్షిక రాబడితో పాటు జనాభా సంఖ్య ఆధారంగా పంచాయతీలను వర్గీకరించేందుకు ప్రభుత్వం జనవరిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. పది వేలకు పైగా జనాభా లేదంటే ఏడాదికి రూ.కోటికి పైగా వార్షికాదాయం ఉండే వాటిని స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా ప్రతిపాదించింది.
జనాభా, రాబడి ఆధారంగా గ్రేడ్–1,2,3 పంచాయతీలుగా వర్గీకరించాలని సిఫార్సులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 350 స్పెషల్ పంచాయతీలుగా గుర్తించాలని నిర్ణయించింది. మరో 2,400 గ్రేడ్–1 కేటగిరిలో, 4,200 గ్రేడ్–2లో, మిగిలిన వాటిని గ్రేడ్–3 కేటగిరిలో కొనసాగించాలని కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతమున్న 5 రకాల గ్రేడ్ పంచాయతీలకు.. 5 రకాల గ్రేడ్‌ల పంచాయతీ కార్యదర్శులున్నారు. వారిని ప్రస్తుత ప్రతిపాదనలకు అనుగుణంగా మార్చేందుకు శుక్రవారం జరిగే సమావేశంలో అభిప్రాయాలు సేకరించనున్నారు.
పంచాయతీ కార్యదర్శుల విభజన ఇలా..
» ప్రసుత్తం గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3, గ్రేడ్–4, గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
» కొత్తగా ఏర్పాటు చేసే స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు ప్రస్తుత గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శుల నుంచి సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. లేదంటే డిప్యూటీ ఎంపీడీవోలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు నియమించే ఆలోచన చేస్తున్నారు.
» గ్రేడ్–1 కార్యదర్శులను కొత్తగా ఏర్పాటయ్యే గ్రేడ్–1 కేటగిరిలో కొనసాగించాలని భావిస్తున్నారు.
» జోనల్ కేడర్‌లో ఉన్న గ్రేడ్–2, జిల్లా కేడర్‌లో ఉన్న గ్రేడ్–3 కార్యదర్శులను కొత్త జోనల్ కేడర్‌లోని గ్రేడ్–2 కార్యదర్శులుగా.. జిల్లా కేడర్‌గా ఉన్న గ్రేడ్–4, గ్రేడ్–5 కార్యదర్శులను కొత్త జిల్లా కేటగిరిలోని గ్రేడ్–3 కార్యదర్శులుగా కొనసాగించేందుకు కసరత్తు చేస్తున్నారు.
