‘మంజీర’కు కొత్త లైన్లు!

New Pipe Lines For Manjeera Water - Sakshi

శిథిలావస్థకు చేరిన పాత పైపులు

కొత్త లైన్లకు రూ.30 కోట్లతో ప్రతిపాదనలు

సుమారు నాలుగు దశాబ్దాల క్రితం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తాగునీటినిసరఫరా చేసేందుకు సంగారెడ్డి శివారులోని మంజీర జలాశయం నుంచి తాగునీటి పైపులైన్లు వేశారు. పైపులు శిథిలావస్థకు చేరుకుంటుం డడంతో లీకేజీల మూలంగాతాగునీరు వృథాగా పోతోంది. పాత పైపులైన్ల స్థానంలో రూ.30 కోట్లతో కొత్త లైన్లువేయాలని హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ వాటర్‌ వర్క్స్‌ బోర్డు ప్రతిపాదనలుసమర్పించింది. మున్సిపల్‌ విభాగం నుంచి అధికారిక ఉత్తర్వు ్డలు వెలువడిన వెంటనే పనులు చేపట్టేందుకు మెట్రోపాలిటన్‌ వాటర్‌ బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంజీర జలాశయంలో నీరు అడుగంటిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా నిలిపివేసే సూచనలు కనిపిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మంజీర నది నుంచి హైదరాబాద్‌ నగరానికి తాగునీరు సరఫరా చేసేందుకు సుమారు నాలు గు దశాబ్దాల క్రితం పైపులైన్లు వేశారు.  వీటి నిర్వహణ బాధ్యతను హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ వర్క్స్, సీవరేజ్‌ బోర్డు చూస్తోంది. ప్రస్తుతం మంజీర ద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిలోని పటాన్‌చెరు, లింగంపల్లి, చందానగర్‌ ప్రాంతాల్లోని 3.22లక్షల జనాభాకు తాగునీరు అందుతోంది. దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్లు శిథిలావస్థకు చేరడంతో తరచూ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. లీకేజీల మూలంగా జనావాసాలకు నీటి సరఫరా ఆలస్యం కావడం, తక్కువ మొత్తంలో నీటి సరఫరా జరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు పటాన్‌చెరు, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో పైపులైన్ల మీదుగా రోడ్లు వేయగా, పైపులైన్లు శిథిలావస్థకు చేరడంతో రోడ్లు కుంగే ప్రమాదం ఉందని మెట్రోపాలిటన్‌ వాటర్‌ వర్క్స్‌ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరుకుంటున్న పైపులైన్ల స్థానంలో కొత్తవి వేయాలని మెట్రోపాలిటన్‌ వాటర్‌ వర్క్స్‌ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.30 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా, పురపాలక శాఖ నుంచి అధికారిక ఆదేశాలు వెలువడాల్సి ఉంది. ఉత్తర్వులు వెలువడిన రెండు మూడు వారాల వ్యవధిలోనే 900 మి.మీ వ్యాసం కలిగిన పైపులైన్ల నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు చోట్ల రోడ్లను తవ్వాల్సి ఉండడం, ట్రాఫిక్‌ను దారి మళ్లించాల్సి రావడంతో అనుమతి కోసం ఇప్పటికే వాటర్‌ వర్క్స్‌ బోర్డు జీహెచ్‌ఎంసీకి లేఖ రాసింది. ఆరు నెలల్లో పైపులైను పనులు పూర్తి చేయడంతో పాటు, కొత్త పైపులైన్ల నిర్మాణం పూర్తయ్యేంత వరకు ప్రస్తుతమున్న విధానంలోనే తాగునీటిని సరఫరా చేస్తారు.

ఎడారిని తలపిస్తున్న ‘మంజీర’
మంజీర , సింగూరు జలాశయాల నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించేందుకు నాలుగు దశల్లో పైపులైన్లు నిర్మించారు. సంగారెడ్డి శివారులోని మంజీర జలాశయం నుంచి ఫేజ్‌–1, ఫేజ్‌–2లో పైపులైన్లు వేశారు. తర్వాతి కాలంలో మంజీర జలాలకు డిమాండ్‌ పెరగడంతో సింగూరు జలాశయం నుంచి ఫేజ్‌–3, ఫేజ్‌–4 పేరిట మరో రెండు పైపులైన్లు నిర్మించారు. వర్షాభావంతో సింగూరు, మంజీర జలాశయాలు ఎడారిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఫేజ్‌ 1, 2 ద్వారా 150 ఎంఎల్‌డీ, ఫేజ్‌ 3, 4 ద్వారా 860 ఎంఎల్‌డీ నీరు ప్రతీ రోజూ హైదరాబాద్‌కు సరఫరా అవుతోంది. 29.91 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉన్న సింగూరు జలాశయంలో ప్రస్తుతం 1.6 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉంది. 1990 ఫిబ్రవరి నాటి జీఓఎంఎస్‌ 93 ప్రకారం సింగూరు జలాశయంలో కనీసం 518 అడుగుల మేర నీరుంటేనే హైదరాబాద్‌కు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 512 అడుగులకు నీటి మట్టం పడిపోయినా, మంజీర పైపులైన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఏప్రిల్‌ నాటికి మంజీర జలాశయం పూర్తిగా అడుగంటే ప్రమాదం ఉండడంతో ఒకటి రెండు రోజుల్లో మంజీర ఫేజ్‌–1, ఫేజ్‌–2 ద్వారా తాగునీటి సరఫరా నిలిపివేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top