'ఆమెకు' అద్దె ఇల్లు కష్టమే!

Nest Away Survey on Lonely Women In Hyderabad - Sakshi

నగరంలో ఒంటరి మహిళలకు ఇల్లు దొరకని వైనం  

మహిళా ఉద్యోగులకు మాత్రం సేఫ్‌ సిటీ  

తొలి స్థానంలో హైదరాబాద్, తర్వాత పుణె, బెంగళూర్‌  

‘నెస్ట్‌ అవే’ సర్వేలో వెల్లడి  

మన నగరం మహిళలకు సేఫ్‌ ప్లేస్‌. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఈ విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భద్రత విషయంలోహైదరాబాద్‌ తొలి స్థానంలో నిలవగా... పుణె, బెంగళూర్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కానీ ఒంటరి మహిళలకు మాత్రం నగరంలో ఇల్లు దొరకడం కష్టంగా మారింది. ‘నెస్ట్‌అవే’ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ మేరకు వెల్లడైంది. 

సాక్షి, సిటీబ్యూరో  : ఈవ్‌ టీజింగ్‌ ఇబ్బందులున్నా, అక్కడక్కడా ఒంటరి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా... ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ మహిళలకు అత్యంత సురక్షితమైనదని తేలింది. ఆన్‌లైన్‌ రెంటల్‌ కంపెనీ నెస్ట్‌అవే చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దీనితో పాటు ఉద్యోగం చేసే ఒంటరి మహిళలు వారు నివసిస్తున్న నగరాలకు సంబంధించి మరికొన్ని అంశాల్లోనూ ఈ సర్వేఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అభిప్రాయాల సేకరణ కోసం వేర్వేరు నగరాల్లోని వేర్వేరు ప్రాంతాలతో పాటు మన నగరంలోని మాదాపూర్, శంషాబాద్, గచ్చిబౌలి ప్రాంతాలలో నివసించే మహిళా ఉద్యోగులను ఎంచుకున్నారు.

అద్దె తక్కువున్నా..దొరకడం కష్టమే..
ఇతర నగరాలతో పోలిస్తే అద్దె ఇల్లు కోసం హైదరాబాద్‌లో మహిళలు చాలా కష్టపడాల్సి వస్తోందని సర్వే తెలిపింది. మిగిలిన మెట్రోలతో పోలిస్తే అద్దెలు నగరంలో కొంత మేర తక్కువే అయినప్పటికీ... ఒంటరి మహిళకు అద్దె ఇల్లు అందుబాటులో ఉండడం లేదు. ఇక అన్ని రకాలుగా తమకు నప్పే ఇల్లు  కోసం అవసరానికి మించి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో ఇంటి అద్దె వ్యయమే తమకు ఎక్కువగా ఉన్నట్టు నగర మహిళలు అభిప్రాయపడ్డారు. తమ నెల జీతాల్లో నుంచి సగానికిపైగా ఇంటి అద్దెలకు వెచ్చిస్తున్నామని అంటున్నారు.  

భద్రతకే ఓటు...
ఇంటిని ఎంచుకోవడంలో అందుబాటులో అద్దెలు, వసతులు, రాకపోకలకు సులువుగా ఉండడం తదితర పక్కకునెట్టి, భద్రతకే మహిళలు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఇల్లు అద్దెకు లభించే ప్రాంతం సురక్షితమైనదిగా భావిస్తే తాము పనిచేసే చోటుకి 5 నుంచి 10 కి.మీ వరకు దూరమైనా సరే తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ ప్రాథామ్యాల నేపథ్యంలో పురుషుల నెలవారీ అద్దె సగటు (రూ.6,900) కన్నా మహిళల నెలవారీ సగటు అద్దె (రూ.7,250) ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు ఏదేమైనా... ఒంటరి మహిళకు అద్దె ఇల్లు దొరకడం నగరంలో అంత సులభం కాదని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు అభిప్రాపడ్డారు. రకరకాల కారణాలను చెబుతూ ఇంటి యజమానులు తమకి ఇల్లు నిరాకరిస్తున్నారని ఒంటరి మహిళలు వాపోతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top