శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ, సరస్వతి కాలువలతో సమానంగా లక్ష్మీ కాలువకు నీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో, 2007లో ప్రాజెక్ట్‌లో 1,045 అడుగుల నీటిమట్టం వద్ద రూ.25 కోట్లతో లక్ష్మీ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు.
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ, సరస్వతి కాలువలతో సమానంగా లక్ష్మీ కాలువకు నీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో, 2007లో ప్రాజెక్ట్‌లో 1,045 అడుగుల నీటిమట్టం వద్ద రూ.25 కోట్లతో లక్ష్మీ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు. కాని ఏడేళ్లు కావస్తున్నా ఇంత వరకు పనులు పూర్తికాలేదు. కొత్త ప్రభుత్వంలోనైనా పనులు ముందుకు సాగి లక్ష్మీ లిప్ట్ రాత మారుతుందా అని ఆయకట్టు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్ట్‌లో ప్రస్తుత ఏడాది నీరు అధికంగా ఉండటంతో పనులు ముందుకు సాగలేదు. నీరు లేనప్పుడు పాలకులు పట్టించుకోలేదు. దీంతో లక్ష్మీ ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులకు అందని గిఫ్ట్‌గా మారింది.
ఉద్దేశం ఇది...
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కోసం సర్వస్వం కోల్పోయిన జిల్లా రైతాంగానికి ఎంతో కొంత నీరందిస్తున్న ఏకైక కాలువ లక్ష్మీ. ఆ కాలువ ద్వారా ప్రాజెక్ట్ నుంచి 1,064 అడుగుల నీటిమట్టం వరకు మాత్రమే నీటి సరఫరా చేపట్టవ చ్చు. దీంతో లక్ష్మీ కాలువ ఆయకట్టు రెండో పంటకు చివరి వరకు నీరందడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్ట పోతున్నారు. వీరి నీరివ్వడానికి లక్ష్మీ లిఫ్ట్ పనులు చేపడతున్నారు. కాని ఏడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు సాగుతున్నాయి.
కాంట్రాక్టర్‌ను మార్చినా...
లిఫ్ట్ నిర్మాణంలో సివిల్ పనులను ఒక కంపెనీ దక్కించుకోగా, మెకానికల్ పనులను కిర్లోస్కర్ అనే కంపెనీ దక్కించుకుంది. కాని పనులు నత్తకు నడక నేర్పేలా సాగించడంతో అధికారులు గతేడాది సివిల్ పనులను కాంట్రాక్ట్ పొందిన రత్న కన్‌స్ట్రక్షన్‌ను మార్చి, సూర్య కన్‌స్ట్రక్షన్‌కు పనులు అప్పగించారు. కాని ప్రయోజనం శూన్యం. పనులు ఒక్క అడుగు ముందుకు, పది అడుగులు వెనక్కు అన్న చందంగానే కొనసాగాయి. ఎట్టి పరిస్థితిల్లో గతేడాది పనులు పూర్తి చేస్తామని అధికారులు ప్రకటనలు చేశారు.
కాని పనులు పూర్తి కాలేదు కదా, పిల్లర్ల స్థాయి దాటలేదు. ప్రస్తుత ఏడాది పనులు ప్రారంభించే అవకాశం లేకపోవడంతో లిఫ్ట్ నిర్మాణ పనులను మరిచే పోయారు. గతేడాది పనులు ఓ మోస్తారుగా సాగినా, ముందస్తు కురిసిన వర్షాలు పనులను సాగనివ్వలేదు. లిఫ్ట్ నిర్మా ణ పనులను చేపట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు..
ఏడేళ్లుగా అసంపూర్తిగా ఉన్న లిఫ్ట్ నిర్మాణ పనులను, కొత్త ప్రభుత్వం త్వరలో పూర్తి చేస్తుందని రైతులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండెకాయగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై, ప్రాజెక్ట్ పనులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాలకులు స్పందించి లిఫ్ట్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. లిప్ట్ నిర్మాణం పూర్తయితే 50 వేల ఎకరాలకు రెండు పంటలకు చివరి వరకు నీరందుతుంది.