breaking news
Sri ransagar project
-
నీరు ఇవ్వలేం..
స్పష్టం చేసిన ఎస్సారెస్పీ ఇంజనీర్లు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేకపోవడమే కారణమని వెల్లడి జిల్లాలో సాగుకు దూరంగా 3.30 లక్షల ఎకరాలు ఆందోళన చెందుతున్న కాల్వ ఆయకట్టు రైతులు హన్మకొండ : ‘ఈ ఖరీఫ్‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా సాగు నీటి విడుదల కష్టమే. ప్రాజెక్టులోకి నీటి ఇన్‌ఫ్లో లేదు... ఇప్పుడు 24 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇలాంటి పరిస్థితిలో.. ఇప్పటికైతే చుక్క నీరు వదిలేది లేదు.’ అని ఎస్సారెస్పీ ఇంజనీర్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సైతం పంపించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎస్సారెస్పీ కాల్వ ఆయకట్టులో 3.30 లక్షల ఎకరాలు సాగుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఖరీఫ్ నీటి విడుదలపై ఈ నెలాఖరు వరకు ప్రణాళిక రూపొందించి.. ఇవ్వాలని ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులను ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన సాగు నీటి పారుదల సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. కానీ... ప్రాజెక్టులోకి నీటి ఇన్‌ఫ్లో లేకపోవడం తో ప్రణాళిక రూపొందించేందుకు ఇంజనీర్లు వెనుకాడుతున్నారు. ఆగస్టు మొదటి వారంలోనే ప్రకటించాల్సిన నీటి విడుదల ప్రణాళిక ఇప్పటివరకు కాగితాలకెక్కపోవడంతో నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్ ఆశలు సన్నగిల్లడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. డెడ్‌స్టోరేజీ నేపథ్యంలో... ఎస్సారెస్పీ నుంచి వరంగల్ జిల్లా వరకు మొదటి విడత కాల్వలకు ఒక్కో తడికి నీళ్లివ్వాలంటే... కనీసం 5 టీఎంసీలను విడుదల చేయూలి. ఈ లెక్కన రెండు తడులకు నీరు విడుదల చేసేందుకు 10 టీఎంసీల నీరు అవసరం. ఒక్క వరంగల్ జిల్లాకే రెండు తడులకు 10 టీఎంసీ నీరు కావాల్సి ఉంది. ప్రస్తుతం 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తే... ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీలోకి వెళ్లనుంది. అంతేకాకుండా... నిజామాబాద్, కరీంనగర్‌ను దాటి మన జిల్లాకు సాగునీరందిం చడం గగనమే. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు అధికారులు ఖరీఫ్‌కు సాగునీరు ఇవ్వలేమని నివేదికల్లో స్పష్టం చేశారు. ప్రణాళికల తయూరీకి ఆపసోపాలు ఖరీఫ్ సాగు నీటి విడుదల ప్రణాళిక రూపొందించడంపై నీటి పారుదల శాఖ అధికారులు ప్రతి ఏటా ఆపసోపాలు పడుతూనే ఉన్నారు. 2012లో ఎస్సారెస్పీలో 65 టీఎంసీల నీరు ఉన్నప్పుడే ఖరీఫ్‌కు నీటిని ఇవ్వలేదు. ఆఖరు సమయాన డిసెంబర్ 15 నుంచి ఏప్రిల్ 10 వరకు తొమ్మిది తడులను వారాబంధీ విధానంలో వదిలారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 24 టీఎంసీలు, ఎల్ఎండీ రిజర్వాయరులో 8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం కాకతీయ కాల్వ ద్వారా ఎల్ఎండీకి చుక్క నీటిని ఇవ్వడం లేదు. ఎస్సారెస్పీలో ఉన్న నీటిలో తాగునీటి అవసరాల దృష్ట్యా 41 టీఎం సీల వరకు నిల్వ చేయడం తప్పనిసరి. నిజామాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు తాగునీటి అవసరాలకు మినహాయించి... మిగిలిన నీటిని సాగు కు విడుదల చేయూలి. ఈమేరకు ప్రణాళిక తయూరుచేయూలి. ఇందులో భాగంగా ప్రాజెక్టు పరిధిలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటరీ అధ్యక్షులు, ప్రాజెక్టు కమిటీతో నీటి విడుదల ప్రణాళికపై తీర్మానం చేసి, ఇంజనీరింగ్ కమిటీకి నివేదించాలి. వారు పరిశీలించి నీటి పారుదల శాఖ, ప్రభుత్వానికి నివేదికలు అందజేయూలి. ఆ తర్వాత నీటి విడుదలకు అనుమతి వస్తుంది. కానీ, ఈ ప్రక్రియ ఎప్పుడూ సజావుగా సాగలేదు. క్రాప్ హాలిడే తప్పదా... 2012లో ఖరీఫ్‌లో ఎస్సారెస్పీ కాల్వల ఆయకట్టులో క్రాప్ హాలిడే ప్రకటించారు. అప్పుడు కూడా ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉండడంతో సాగుకు నీరివ్వలేదు. తాజాగా అలాంటి పరిస్థితి ఉండడంతో ఖరీఫ్‌లోనే శ్రీరాంసాగర్ ఆయకట్టులో క్రాప్ హాలిడే ప్రకటించేందుకు ప్రాజెక్టు అధికారులు... ప్రభుత్వానికి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇచ్చినా... చివరి సమయంలో ఒకటో, రెండో తడులకు మాత్రమే నెలలో రెండుసార్లు ఇచ్చే అవకాశాలున్నాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు తడులు కూడా కష్టమేనని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. నీటి విడుదల కష్టమే... ఖరీఫ్‌లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయడం కష్టమే. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేదు. మహారాష్ట్రలో దిగువ ప్రాంతంలో మాత్రమే వానలు పడుతున్నారుు. ప్రస్తుతం ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సుమారు 55 నుంచి 60 టీఎంసీలు నిల్వ ఉంటేనే రెండు, మూడు తడులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి లేకపోవడంతో ఖరీఫ్‌లో కాల్వల ఆయకట్టుకు నీరందించే ప్రణాళిక కూడా తయారు చేయలేదు. - సుధాకర్‌రెడ్డి, ఎస్ఈ, ఎస్సారెస్పీ-1, హన్మకొండ -
‘లక్ష్మీ’ లిఫ్ట్ రాత మారేనా..!
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ, సరస్వతి కాలువలతో సమానంగా లక్ష్మీ కాలువకు నీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో, 2007లో ప్రాజెక్ట్‌లో 1,045 అడుగుల నీటిమట్టం వద్ద రూ.25 కోట్లతో లక్ష్మీ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు. కాని ఏడేళ్లు కావస్తున్నా ఇంత వరకు పనులు పూర్తికాలేదు. కొత్త ప్రభుత్వంలోనైనా పనులు ముందుకు సాగి లక్ష్మీ లిప్ట్ రాత మారుతుందా అని ఆయకట్టు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్ట్‌లో ప్రస్తుత ఏడాది నీరు అధికంగా ఉండటంతో పనులు ముందుకు సాగలేదు. నీరు లేనప్పుడు పాలకులు పట్టించుకోలేదు. దీంతో లక్ష్మీ ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులకు అందని గిఫ్ట్‌గా మారింది. ఉద్దేశం ఇది... శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కోసం సర్వస్వం కోల్పోయిన జిల్లా రైతాంగానికి ఎంతో కొంత నీరందిస్తున్న ఏకైక కాలువ లక్ష్మీ. ఆ కాలువ ద్వారా ప్రాజెక్ట్ నుంచి 1,064 అడుగుల నీటిమట్టం వరకు మాత్రమే నీటి సరఫరా చేపట్టవ చ్చు. దీంతో లక్ష్మీ కాలువ ఆయకట్టు రెండో పంటకు చివరి వరకు నీరందడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్ట పోతున్నారు. వీరి నీరివ్వడానికి లక్ష్మీ లిఫ్ట్ పనులు చేపడతున్నారు. కాని ఏడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు సాగుతున్నాయి. కాంట్రాక్టర్‌ను మార్చినా... లిఫ్ట్ నిర్మాణంలో సివిల్ పనులను ఒక కంపెనీ దక్కించుకోగా, మెకానికల్ పనులను కిర్లోస్కర్ అనే కంపెనీ దక్కించుకుంది. కాని పనులు నత్తకు నడక నేర్పేలా సాగించడంతో అధికారులు గతేడాది సివిల్ పనులను కాంట్రాక్ట్ పొందిన రత్న కన్‌స్ట్రక్షన్‌ను మార్చి, సూర్య కన్స్ట్రక్షన్కు పనులు అప్పగించారు. కాని ప్రయోజనం శూన్యం. పనులు ఒక్క అడుగు ముందుకు, పది అడుగులు వెనక్కు అన్న చందంగానే కొనసాగాయి. ఎట్టి పరిస్థితిల్లో గతేడాది పనులు పూర్తి చేస్తామని అధికారులు ప్రకటనలు చేశారు. కాని పనులు పూర్తి కాలేదు కదా, పిల్లర్ల స్థాయి దాటలేదు. ప్రస్తుత ఏడాది పనులు ప్రారంభించే అవకాశం లేకపోవడంతో లిఫ్ట్ నిర్మాణ పనులను మరిచే పోయారు. గతేడాది పనులు ఓ మోస్తారుగా సాగినా, ముందస్తు కురిసిన వర్షాలు పనులను సాగనివ్వలేదు. లిఫ్ట్ నిర్మా ణ పనులను చేపట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు.. ఏడేళ్లుగా అసంపూర్తిగా ఉన్న లిఫ్ట్ నిర్మాణ పనులను, కొత్త ప్రభుత్వం త్వరలో పూర్తి చేస్తుందని రైతులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండెకాయగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై, ప్రాజెక్ట్ పనులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాలకులు స్పందించి లిఫ్ట్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. లిప్ట్ నిర్మాణం పూర్తయితే 50 వేల ఎకరాలకు రెండు పంటలకు చివరి వరకు నీరందుతుంది.