నారాయణపేట – కొడంగల్‌కు నీళ్లు వచ్చేనా? 

Narayanapeeta - Kondangal Is Water Coming From Krishna - Sakshi

సాక్షి, కొడంగల్‌:  పక్కనే కృష్ణమ్మ ప్రవహిస్తున్నా.. నారాయణపేట – కొడంగల్‌ ప్రాంతానికి మాత్రం సాగునీరు అందే పరిస్థితులు కనిపించడం లేదు. తెలంగాణ వస్తే చాలునని ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నా.. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఈ ఉద్యమంలో పాల్గొన్నా. కృష్ణా జలాలు పొలాలను తడుపుతాయని పూణె, బొంబాయి పోయే బాధ తప్పదని ఆశపడ్డా.

నిజానికి కృష్ణానది కొడంగల్‌ ప్రాంతానికి పెద్ద దూరమేమీ లేదు. ఇక్కడ పడే ప్రతీ బొట్టు అక్కడే కలుస్తది. అదే కృష్ణమ్మ కర్ణాటక నుంచి నీళ్లు మోసుకొస్తది. కింద పడ్డ నీళ్లూ తక్కువే. ఆ వచ్చేటటువంటి వరదను జూరాల వద్ద నుంచే మళ్లించి కింద నారాయణపేట నుంచి ఒక్కో చెరువును నింపుకుంటూ వచ్చి మన దగ్గర ఉన్న చెరువులను నింపుకుంటే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటది.

కొడంగల్‌ ప్రాంతమంతా దారి పొడవునా అన్ని పొలాలు బీడువారి పోయి కనిపించాయి. అందుకే ప్రజలు వలసపోయి బతుకుతున్నరు. కొడంగల్‌లో ఇళ్లన్నీ తాళాలే పడి ఉంటాయి. కొడంగల్‌ – నారాయణపేటలో ఏ ఊరికి వెళ్లినా అదే పరిస్థితి. కానీ ఈ నాలుగేళ్లలో నీళ్లు మాత్రం రాలేదు. వస్తయనుకున్న నీళ్లు ఆశ చూపుతున్నాయే కానీ వచ్చే అవకాశం లేదు.

కేసీఆర్‌ మాత్రం నీళ్లు కింద జారిపోయిన తర్వాత అక్కడ కింద శ్రీశైలం నుంచి చుట్టూ తిప్పి, తిప్పి అప్పుడు కొడంగల్‌ ప్రాంతానికి నీళ్లు తెస్తనంటడు. సక్కగ వచ్చే వరదను వదిలిపెట్టి చుట్టూ తిప్పి తీసుకొస్తడంటే మనమేమైన నమ్ముతమా? చెవుల్లో పూలు పెట్టుకున్నమా? కింద నీళ్లు ఎక్కువ ఉంటయంట కదా అని స్థానికులను అడిగితే వరద ఎక్కడి నుంచి పోతుందో తెలియనంత అమాయకులము కాదు కదా అని అంటున్నరు.

పక్కనున్న నీళ్లు రావు కానీ.. ఎక్కడెక్కడి నుంచో తిప్పి తీసుకొచ్చే నీళ్లు వస్తయా? అని అడుగుతున్నరు. చైతన్యం కలిగిన కొడంగల్‌ ప్రజలకు అన్యాయం జరగకూడదనే ఆలోచనతో మేము కూడా ఎన్నో ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పాలమూరు – రంగారెడ్డిని యథాతధంగా అమలు చేయాలని ఎన్నో ఆందోళనలు చేశాం.

ఏ ఒక్క ఆందోళనకు ప్రభుత్వం స్పందించలేదు. దీనికంతటికీ కారణమేమిటంటే కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ప్రాజెక్టుల డిజైన్లు మార్చిండ్రు కానీ మన బతుకులు మార్చడానికి ప్రాజెక్టులు కడతలేరని అర్థమైంది. ఇలాంటి ప్రభుత్వం ఉండడానికి వీలులేదని ఒక నిర్ణయానికి వచ్చాం. పరిపాలన చేసే నైతిక అధికారం లేనే లేదు. ఆయన ఎలాగూ నడమంత్రానే దిగిపోయిండు. మళ్లీ పిలిచి పట్టం కట్టాల్సిన అవసరం లేనే లేదు. 
– ప్రోఫెసర్‌ కోదండరాం, టీజేఎస్‌ అధ్యక్షుడు 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top