నల్లగొండ జిల్లాలో నెలకొల్పనున్న దామరచర్ల విద్యుత్ ప్లాంటు, నక్కలగండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఒకేరోజు శంకుస్థాపన చేయాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.
- ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
- పాలమూరు ఎత్తిపోతలపై మాత్రం ఇంకారాని స్పష్టత
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో నెలకొల్పనున్న దామరచర్ల విద్యుత్ ప్లాంటు, నక్కలగండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఒకేరోజు శంకుస్థాపన చేయాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వచ్చే నెల 15లోగా వీటికి శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నక్కలగండి పథకం రీ ఇంజనీరింగ్‌లో భాగంగా ప్రాజెక్టులో ఇతర ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకోవాలని భావించిన ప్రభుత్వం ప్రత్యేక అధ్యయనం చేయించడంతో కాస్త ఆలస్యం జరిగింది. ప్రస్తుతం దీనిపై స్పష్టత రావడంతో పాలనా అనుమతులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టాలని భావిస్తోంది.
7.64 టీఎంసీల సామర్థ్యం ఉండే నక్కలగండి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి మిడ్‌డిండి ద్వారా అప్పర్ డిండి వరకు నీటిని తరలించేందుకు రూ.5,600ల కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో 11 టీఎంసీలు ఉండే మిడ్‌డిండి రిజర్వాయర్ కింద లక్ష ఎకరాలు, దీనికి 97 కిలోమీటర్ల దూరంలోని అప్పర్‌డిండి రిజర్వాయర్ కింద మరో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు రూ.750 కోట్లతో అంచనాలు వేసిన మిడ్‌డిండి రిజర్వాయర్, కాల్వల తవ్వకానికి తొలి ప్రాధాన్యమిచ్చి ఈ పనులకే శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది.
పాలమూరు ఎత్తిపోతలపై ఇంకా తర్జనభర్జన
ఇక ప్రభుత్వం చేపడతామని చెబుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శంకుస్థాపన విషయంలో ఇంకా తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద ముంపు నివారణ కసరత్తులు కొలిక్కి రాకపోవడంతో పనుల ఆరంభంపై స్పష్టత లేదు. ముంపు తగ్గింపుపై ఇంజనీర్ల బృందం ఓ నిర్ణయానికి వచ్చాకే దీనిపై ప్రభుత్వం ముందుకు కదిలే అవకాశాలున్నాయి.