అణువణువూ పర్యటించా | Muttireddy Yadagiri Reddy Filed Nomination | Sakshi
Sakshi News home page

నియోజకవర్గమంతా అణువణువూ పర్యటించా

Nov 15 2018 3:50 PM | Updated on Nov 15 2018 3:50 PM

Muttireddy Yadagiri Reddy Filed Nomination - Sakshi

నామినేషన్‌ సమర్పించిన అనంతరం మాట్లాడుతున్న ముత్తిరెడ్డి యాదగరి రెడ్డి

సాక్షి, జనగామ: జనగామ నియోజకవర్గంలో అణువణువునా పర్యటించి అందరి కష్టాలు తెలుసుకుని  పరిష్కారం దిశగా కృషి చేసిన ఏకైక నాయకుడిగా తాను ప్రజల మనసుల్లో నిలిచిపోయానని తాజామాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌ఓ కార్యాలయంలో బుధవారం నామినేషన్‌ వేసిన తర్వాత మాజీ విప్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి ముత్తిరెడ్డి మాట్లాడుతూ జనగామ చరిత్రలో తాను మినహా ఏ ఒక్క ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేరన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో జనగామ ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. ముందస్తు ఎన్నికల్లో గతం కంటే తాను రెట్టింపు మెజార్టీతో  గెలుపొందడం ఖాయమని తేలిపోయిందన్నారు.

అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు కోటి ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంగా అత్యంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భాగోతాన్ని స్వయాన భారత ప్రధాని నరేంద్ర మోదీ బయటపెట్టారన్నారు. ఉమ్మడి పాలనలలో ఈ ప్రాంత వనరులను అడ్డంగా దోచుకుని, కూడబెట్టిన లక్షల కోట్లతో మరోసారి ఎత్తులు వేసే ప్రయత్నం చేస్తున్నట్లు బాబుపై విరుచుపడ్డాడు. ముందస్తు ఎన్నికల్లో 107 సీట్లు గెలుపొంది టీఆర్‌ఎస్‌ మరో చరిత్ర సృష్టించబోతుందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కష్టపడిన కేసీఆర్‌ను ఎదుర్కొ నే దమ్ము..ధైర్యం ఎవరికీ లేదన్నారు.

టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల గెలిచినా.. ఓడినా ఎప్పుడూ హైదరాబాద్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు. ఆయన ప్రజల కు దూరంగా ఉంటున్నారనే నెపంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ కూడా ఆయనకు జనగామ టికెట్‌ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. ఆయన వెంట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, కొమురవెల్లి ఆలయ చైర్మన్‌ సేవెల్లి సంపత్, ఏఎంసీ చైర్‌పర్సన్‌ బండ పద్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ సమన్వయ కర్త గుజ్జ సంపత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరి రెడ్డి, నాయకులు గజ్జెల నర్సి రెడ్డి, కొమరవెల్లి మాజీ సర్పంచ్‌ మల్లేశం, పసుల ఏబేలు, మదార్‌ షరీఫ్, ఇర్రి రమణారెడ్డి, బాల్దెసిద్దిలింగం, బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి, చంద్రారెడ్డి ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement