పొన్నాలను ప్రజలే వద్దంటున్నారు

Muthireddy Yadagiri Reddy Election Campaign Warangal - Sakshi

సాక్షి, జనగామ: జనగామ ప్రాంతాన్ని అభివృద్ధి చేయని పొన్నాల లక్ష్మయ్యను నియోజకవర్గ ప్రజలు  అభ్యర్థిత్వం ఖరారు కాకముందే నిరాకరిస్తున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జనగామ మండలంలోని గోపిరాజుపల్లి, పెద్దపహాడ్, ఎర్రగుంటతండా, కళ్యాన్‌ నగర్, దుబ్బతండాలో శనివారం ముత్తిరెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళలు  కోలాటంతో బ్రహ్మరథం పట్టారు. అనంతరం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ మూడు సార్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య ప్రజలకు అవసరమయ్యే ఏ ఒక్క పని చేయలేదని ఆరోపించారు. గోదావరి నీటిని తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని, నీటిని పంపింగ్‌ చేసే డ్యాం వద్ద తక్కువ వోల్టేజీ మోటార్లను బిగించడంతో మన ప్రాంతం ఎడారిగా మారిందన్నారు.

తాను ఎమ్మెల్యేగా గెలుపొందగానే సీఎం కేసీఆర్‌తో కొట్లాడి దేవాదుల ప్రాజెక్టు వద్ద మోటార్ల సామర్థ్యం పెంచి, చెరువులకు సరిపడా నీటిని మళ్లించామన్నారు. గత మూడేళ్లుగా పంట ఉత్పత్తులు గణనీయంగా పెరగడంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. జనగామ చరిత్రలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక ఎమ్మెల్యేను తాను మాత్రమేనన్నారు. నాలుగున్నరేళ్ల పాటు కనిపించని పొన్నాల లక్ష్మయ్య ఎన్నికలు రాగానే ప్రత్యక్షమయ్యారని దుయ్యబట్టారు. కాగా కాంగ్రెస్‌తోపాటు పలు పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరగా, ముత్తిరెడ్డి వారిని స్వాగతించారు.

ప్రతిచోట ప్రభుత్వ పథకాలను గుర్తు చేస్తూ వారిచే హామీ తీసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు బాల్దె సిద్ధిలింగం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మేకల కలింగరాజు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ బూరెడ్డి ప్రమోద్‌ కుమార్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ భూక్యా శంకర్‌ నాయక్, యువజన నాయకులు నీల రామ్మోహన్, ఆయా గ్రామాల నాయకులు పురేందర్‌రెడ్డి, రాజేశ్వర్, దండు సిద్ధులు, రవి, ఖలీల్, దేవేందర్‌రెడ్డి, దేవ్‌సింగ్, భూక్యా భాస్కర్, నర్పింహ, మాలోతు సక్రు, సిద్ధులు, నాగరాజు, రంగ, గంగ, ఆగయ్య ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top