.. అను నేను

Municipal Chairman Oath Ceremony In Kagaznagar At Adilabad - Sakshi

దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన చైర్మన్, వైస్‌చైర్మన్, కౌన్సిలర్లు

కొలువుదీరిన మున్సిపల్‌ నూతన పాలకవర్గం

ఎక్స్‌ అఫీషియోగా హాజరైన ఎమ్మెల్యే కోనప్ప

కాగజ్‌నగర్‌: ‘‘ఎండీ సద్దాం హుస్సేన్‌ అనే నేను కాగజ్‌నగర్‌ పురపాలక సంఘం సభ్యుడిగా, శాసనము ద్వారా నిర్మితమైన..’’ ‘‘రాచకొండ గిరీశ్‌కుమార్‌ అనే నేను కాగజ్‌నగర్‌ పురపాలక సంఘం సభ్యుడిగా, శాసనము ద్వారా నిర్మితమైన..’’అంటూ సాగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంతో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశాల మేరకు కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కార్యాలయం కౌన్సిల్‌ సమావేశ మందిరంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ సీఈవో వేణు నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.

ముందుగా ఎన్నికల సంఘం నియమనిబంధనలను చదివి వినిపించారు. ఉదయం 11 గంటలకు జెడ్పీ సీఈవో ఒక్కొక్కరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా కౌన్సిలర్‌ ఎల్లేష్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 10వ వార్డు కౌన్సిలర్‌ అన్నబోయిన విజయ భగవంతుని ప్రమాణంతో పాటు తన భర్త వనమాల రాముపై ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిలర్లు ప్రమాణ స్వీకార పత్రంపై సంతకాలు చేశారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎక్స్‌ అఫీషియగా హాజరై పర్యవేక్షించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఏకగ్రీవంగా చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక..
పట్టణంలోని 30 వార్డుల్లో అధికార టీఆర్‌ఎస్‌ 22 స్థానాలు కైవసం చేసుకోగా సోమవారం చైర్మన్, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవంగా చేపట్టారు. చైర్మన్, వైస్‌చైర్మన్‌ పేర్లను జెడ్పీ సీఈవో ప్రకటించారు. వారికి పార్టీ బీ ఫారం అందించినట్లు పేర్కొన్నారు. చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ను పంబాల సుజాత ప్రతిపాదించగా, బొద్దున విద్యావతి బలపర్చారు. వైస్‌చైర్మన్‌ రాచకొండ గిరీష్‌కుమార్‌ను స్వామిశెట్టి రాజేందర్‌ ప్రతిపాదించగా, విజయ్‌యాదవ్‌ కుమార్‌ బలపర్చారు. చైర్మన్‌ పదవిని సద్దాం హుస్సేన్, గిరీష్‌కుమార్‌ చెరో రెండున్నర సంవత్సరాలు పాలించనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం వీరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఆలింగనము చేసుకున్నారు.

నూతన అధ్యయనం మొదలు.. – ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో నూతన అధ్యయనం మొదలైందని ఎమ్మెల్యే కోనప్ప పేర్కొన్నారు. నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకతీతంగా మున్సిపల్‌ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అభివృద్ధిలో, పాలనలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. చైర్మన్‌ హుస్సేన్, వైస్‌చైర్మన్‌ గిరీష్‌కుమార్‌ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన పాలకవర్గ సభ్యులకు, ఎమ్మెల్యే కోనప్పకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల, పాలకవర్గం సభ్యుల నమ్మకం వమ్ముకాకుండా మున్సిపల్‌ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top