
తెలంగాణ అడవుల్లోని ఆదివాసీల వేదనను వీరత్వంగా మార్చిన కొమరం భీమ్ (Kumaram Bheem ) జీవిత గాథ మొత్తం భారత ఆదివాసీ పోరాటాల చరిత్రలో ప్రత్యేకమైనది. 1901లో, అప్పటి ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా)‘సంకెపల్లి’ సమీపంలో గోండు తెగలో జన్మించిన భీమ్, బాల్యంలోనే సామాజిక అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు. అడవి ఆధారిత జీవన విధానాన్ని ధ్వంసించే అధికారాలకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. తండ్రి చుక్కా భీమ్‌ను అటవీ అధికారుల దౌర్జన్యంలో కోల్పోవడం ఆయన జీవితాన్ని మార్చింది.
1930వ దశకంలో నిజాం పాలన గిరిజనులకు నరకమే. పన్నులు, అడవిలో ప్రవేశ నిషేధం, వేట నియంత్రణ, రజాకార్ల దుర్మార్గాలు– ఇవన్నీ సాధారణ గిరిజనులను మట్టుబెట్టాయి. ఈ సందర్భంలో భీమ్ నినదించిన ‘జల్, జంగిల్, జమీన్’ (నీరు, అడవి, భూమి) గిరిజనుల ప్రాణాధారాలేమిటో ఎలుగెత్తి చాటాయి. ‘జోడేఘాట్’ ఉద్యమ కేంద్రంగా మారింది. 1928–1940లో జోడేఘాట్ అడవులు ఆయన ఉద్యమానికి స్థావరంగా నిలిచాయి. కొమరం సూరు, వెడ్మ రాము, జంగు, సోమయ్యల వంటి సహచరులు గిరిజనుల్లో చైతన్యాన్ని నింపారు. నిజాం సైన్యం, రజాకార్లు ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించినా, భీమ్ వెనకడుగు వేయలేదు. ఆయన గెరిల్లా పోరాటం ప్రజామద్దతుతో ఆధారంతో నడిచింది. 1940 అక్టోబర్ 27న ఆశ్వయుజ పౌర్ణమి రాత్రి, నమ్మకద్రోహం కారణంగా భీమ్ స్థావరాన్ని నిజాం సైన్యం చుట్టుముట్టింది. భీమ్ చివరి శ్వాస వరకు వెనకడుగు వేయకుండా పోరాడి వీరమరణం పొందాడు. అయినా భీమ్ ఆలోచనలు మరణించలేదు. ‘జల్, జంగిల్, జమీన్’ భావన నేటికీ గిరిజన ఉద్యమాలకు మార్గదర్శకంగా ఉంది. 2006లో పార్లమెంట్ ఆమోదించిన ‘ఫారెస్ట్ రైట్స్ యాక్ట్’ ద్వారా గిరిజనులకు వారి సంప్రదాయ హక్కులుగా అడవులపై హక్కులు కల్పించబడ్డాయి. ఇది కొమరం భీమ్ ఆలోచనలకు చట్టబద్ధ రూపం.
కొమరం భీమ్ పోరాటం హింస పట్ల వ్యతిరేకంగా, ప్రజా చైతన్యానికి ఆధారంగా సాగింది. నేటి యువతకు ఆయన జీవితం స్పష్టమైన దిశానిర్దేశం. ప్రకృతి, ప్రాథమిక హక్కులు, సమాజం భవిష్యత్తు కోసం ‘జల్, జంగిల్, జమీన్’ తత్త్వం మరింత ప్రాసంగికమైంది. జోడేఘాట్‌లో నిర్మించిన కొమరం భీమ్ స్మారక చిహ్నం, గిరిజన ఉద్యమ చైతన్యానికి ప్రేరణ. ‘కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా’ ఆయన ఆత్మగౌరవానికి భారతదేశం ఇచ్చిన గుర్తింపు.
ఈ అక్టోబర్ 22న ఆయన జయంతి సందర్భంగా, పూలమాలలు సమర్పించడం కంటే ముఖ్యమైన నివాళి – ఆత్మగౌరవ గిరిజన భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం! ఇదే మనం చెయ్యగలిగే గొప్ప గౌరవార్పణ.
– కాయం నవేంద్ర, జాతీయ కన్వీనర్, అఖిల భారతీయ వనవాసి
(నేడు కొమరం భీమ్ జయంతి)