25 నుంచి మునిసిపల్‌ సమ్మె! | Sakshi
Sakshi News home page

25 నుంచి మునిసిపల్‌ సమ్మె!

Published Thu, Apr 12 2018 2:12 AM

Municipal JAC Go To Strike in Telangana on 25th April ! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునిసిపల్‌ కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల వేతనాలను తక్షణమే పెంచాలని, లేని పక్షంలో ఈనెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్‌ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగిలిన 72 మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పని చేస్తున్న 16 వేల మంది కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారని స్పష్టం చేసింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన వేతనాల పెంపు డిమాండ్‌పై బుధవారం రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టరేట్‌ ముందు కార్మికులతో ధర్నా నిర్వహించింది. 

అనంతరం ఆ శాఖ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ మేరకు సమ్మె హెచ్చరికలు జారీ చేసింది. జేఏసీ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ నేతృత్వంలోని కార్మిక సంఘాల నేతలు పురపాలక శాఖ అధికారులకు ఈ మేరకు సమ్మె నోటీసులు అందించారు. పురపాలికల్లో కీలకమైన పారిశుధ్య సేవలు, పార్కులు, నీటి సరఫరా, వీధి దీపాలు, మలేరియా నివారణ, బిల్‌ కలెక్టర్లు, సూపర్‌వైజర్లు, ఆఫీసు సిబ్బందితోపాటు వివిధ కేటగిరిల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది తమ విధులను బహిష్కరించి సమ్మెలోకి దిగనున్నారని వెల్లడించారు. 

ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి 
రాష్ట్రంలోని పురపాలికల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల వేతనాలను జీవో నం.14 ప్రకారం కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా వరుసగా రూ.17.5 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలకు పెంచాలని జేఏసీ డిమాండ్‌ చేస్తోంది. ప్రస్తుతం కార్మికులకు చెల్లిస్తున్న రూ.8,300 వేతనం ఏ మాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ‘వేతనాలు పెంచినా చెల్లించాల్సింది పురపాలికలే కాబట్టి అవే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అయితే పురపాలికల ఆదాయం అంతంత మాత్రమే ఉందని, వేతనాలు పెంచితే చెల్లించే స్తోమత పురపాలికలకు లేదని ఇప్పటికే మేయర్లు, మునిసిపల్‌ చైర్‌పర్సన్లు తేల్చి చెప్పారు. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలనే 3 నెలలకోసారి చెల్లిస్తున్నామని వారు ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్మికు ల వేతనాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి’అని జేఏసీ డిమాండ్‌ చేసింది.

రెండోసారి సమ్మెకు సై!
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేతనాల పెంపు డిమాండ్‌తో 2015 జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్‌ కార్మికులు సమ్మె నిర్వహించారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యర్థాలు, చెత్త పేరుకుపోయి సామాన్య ప్రజలు అవస్తలకు గురయ్యారు. సమ్మె విరమిస్తే వేతనాల పెంపును పరిశీలిస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్‌ హామీ ఇవ్వడంతో కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. అయితే జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాలు పెంచిన ప్రభుత్వం మిగిలిన పురపాలికల్లో పని చేస్తున్న కార్మికుల విషయంలో ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు.

Advertisement
Advertisement