దోస్తీ.. కుస్తీ! | muncipal chairmen selections | Sakshi
Sakshi News home page

దోస్తీ.. కుస్తీ!

Jul 1 2014 5:02 AM | Updated on Mar 22 2019 6:18 PM

దోస్తీ.. కుస్తీ! - Sakshi

దోస్తీ.. కుస్తీ!

‘ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చింది’ అనే చందంగా తయారైంది జిల్లాలో టీడీపీ పరిస్థితి.

స్థానిక, మునిసిపల్ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకునేందుకు దోస్తీ కోసం కాంగ్రెస్, టీడీపీలు కుస్తీ పడుతున్నాయి. తమకు అధికారం రాకపోయినా సరే సభ్యులు చేజారకుండా టీడీపీ నేతలు నానాతంటాలు పడుతున్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఈ ఐదేళ్లకాలంలో లబ్ధిపొందేందుకు టీఆర్‌ఎస్ శిబిరం వైపు చూస్తున్నారు. కాగా, సొంతంగా మునిసిపల్, మండల పరిషత్ చైర్మన్ పదవులను దక్కించుకోలేక.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు మద్దతు ఇవ్వలేక.. పార్టీ అధిష్టానం ఏం చెబుతుందో తెలియక తికమక పడుతున్నారు.
 

  • మద్దతుపై టీడీపీ మల్లగుల్లాలు
  •   ‘స్థానిక’పై పార్టీనేతల్లో అయోమయం
  •   సభ్యులు చేజారకుండా నానాతంటాలు
  •   కాంగ్రెస్‌కు మద్దతు పలకాలని యోచన
  •   టీఆర్‌ఎస్ వైపు చూస్తున్న కొత్తసభ్యులు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చింది’ అనే చందంగా తయారైంది జిల్లాలో టీడీపీ పరిస్థితి. జిల్లా పరిషత్‌తో పాటు మండల, మునిసిపల్ చైర్మన్ల ఎంపికలో ఆ పార్టీ సభ్యుల మద్దతు కీలకం కానుంది. దీంతో తమకు పదవులు దక్కే పరిస్థితి లేకున్నా పార్టీ తరఫున ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో పాటు కౌన్సిలర్లు చేజారకుండా పార్టీ నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


స్థానిక సంస్థల చైర్మన్ల పరోక్ష ఎన్నిక తేదీ సమీపిస్తుండటంతో ఎవరికి మద్దతు పలకాలనే అంశంపై టీడీపీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. ‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అనే సూత్రం ప్రకారమే తమ మద్దతు కీలకమైన చోట కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే పార్టీ తరఫున ఎన్నికైన కొత్త సభ్యుల ఆలోచన మాత్రం మరోలా కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు స్థానిక ఎన్నికల్లో మద్దతు పలికితే ఈ ఐదేళ్లకాలంలో మరింత లబ్ధిపొందొచ్చని టీడీపీ సభ్యులు లెక్కలు వేసుకుంటున్నారు.

సాధారణ ఎన్నికల్లో అవగాహన కుదుర్చుకుని పోటీచేసిన టీడీపీ, బీజేపీ మధ్య స్థానిక ఎన్నికల్లో అంతగా సయోధ్య కనిపించడం లేదు. స్థానిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేనందున తమ పార్టీకి లబ్ధిచేకూరేలా ఎవరికి మద్దతు పలకాలో నిర్ణయం తీసుకుంటామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అదునుగా టీడీపీ, బీజేపీ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది.
 
స్పష్టత ఇవ్వని టీడీపీ నేతలు
 స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటివరకు టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత లభించకపోవడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ మద్దతు తమకే దక్కుతుందని టీఆర్‌ఎస్ ఘంటాపథంగా చెబుతోంది.
 
మరోవైపు తాము కూడా టీడీపీ మద్దతు కోరినట్లు మాజీమంత్రి డీకే అరుణ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వం కాంగ్రెస్‌కు మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ టీడీపీ మద్దతు లభించని పక్షంలో అవసరమైతే సభ్యుల్లో చీలిక తేవాలనే వ్యూహం టీఆర్‌ఎస్ శిబిరంలో కనిపిస్తోంది. జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం సాధించే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి పద్మారావుకు సీఎం కేసీఆర్ అప్పగించిన విషయం తెలిసిందే.
 
మునిసిపాలిటీల విషయానికొస్తే జిల్లాలో వనపర్తి మినహా మిగతాచోట్ల టీడీపీ పెద్దగా కౌన్సిలర్ స్థానాలు సాధించిన దాఖలాల్లేవు. వనపర్తిలో బీజేపీ మద్దతు లభిస్తేనే చైర్మన్ పీఠం దక్కనుంది. క్షేత్రస్థాయిలో రెండుపార్టీల నడుమ ఏకాభిప్రాయం కొరవడటంతో కాంగ్రెస్‌తో జత కట్టడం ద్వారా చైర్మన్ పదవి దక్కించుకోవాలనే యోచనతో ఉన్నట్లు సమాచారం. మొత్తంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య జెడ్పీ, మండల పరిషత్, మునిసిపల్ చైర్మన్ల పదవుల పోటీలో టీడీపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క సామెతను తలపిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement