కరోనా : మొన్న కూతురు.. నేడు తల్లి!

Mother And Daughter Infected With Coronavirus With In 2days In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ : జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ 21 తర్వాత కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడంతో పరిస్థితి అదుపులోకి వస్తోందని భావిస్తున్న తరుణంలో సోమవారం మరో కేసు బయట పడింది. హన్మకొండ పూరిగుట్ట తండాకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లుగా డీఎంహెచ్‌ఓ లలితాదేవి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. హసన్‌పర్తి పూరిగుట్ట తండా వాసి, ఢిల్లీలో కానిస్టేబుల్‌గా పనిచేసే వ్యక్తి పదేళ్ల కుమార్తెకు గతంలో పాజిటివ్‌ వచ్చిన విషయం విదితమే. ఇప్పుడు బాలిక తల్లికి సైతం వైరస్‌ సోకిందని డీఎంహెచ్‌ఓ తెలిపారు. ఏప్రిల్‌ 21న బాలికకు పాజిటివ్‌ రాగా.. ఆ చిన్నారి తల్లి కూడా గాంధీ ఆస్పత్రిలో కుమార్తెతో పాటే ఉంటోంది. ఈక్రమంలో అనుమానంతో ఆమె శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో గాంధీ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. (కరోనా : హైదరాబాద్‌ పాతబస్తీకి ఊరట)

28కి చేరిన కేసులు
సోమవారం నమోదైన పాజిటివ్‌ కేసుతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 37కు చేరింది. ఇక ఇప్పటికే రెడ్‌జోన్‌లో ఉన్న వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కేసుల సంఖ్య 28కి చేరినట్లయింది. అర్బన్‌ జిల్లాలో 15 కంటైన్మెంట్‌ క్లస్టర్లు ఉండగా.. నాలుగింటిలో సడలింపు ఇచ్చారు. మిగిలిన 11 క్లస్టర్లు కూడా ఎత్తివేయాలని అధికా రులు ప్రభుత్వానికి నివేదిక పంపించగా.. సోమవారం మరో కేసు రావడంతో క్లస్టర్ల ఎత్తివేత కష్టమేనన్న చర్చ జరుగుతోంది. ఇక పూరిగుట్ట తండా ఇప్పటికే కంటైన్మెంట్‌ క్లస్టర్‌గా కొనసాగుతోంది. తాజాగా మ రో కేసు రావడంతో బయటి వారెవరూ లోపలకు రాకుండా... లోపల ఉన్న వారు బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. (తెలంగాణలో మద్యానికి ఓకే!)

‘పాజిటివ్‌’ కేసులపై అధికారుల సమీక్ష
పూరిగుట్ట తండాకు చెందిన పదేళ్ల చిన్నారి తల్లికి సైతం కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంటైన్మెంట్‌ క్లస్టర్లలో నిఘా ముమ్మరం చేయడంతో పాటు ప్రత్యేక సర్వే నిర్వహించేందుకు బృందాలను కేటాయించారు. ఈ మేరకు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్, గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, డీఎంహెచ్‌ఓ లలితా తదితరులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోన వైరస్‌ కట్టడికి మరింత కఠినంగా వ్యవహరించాలని, రెడ్‌జోన్‌లో ఉన్నందున జనసంచారం విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వొద్దని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. వాహనాల తనిఖీలు యథాతథంగా కొనసాగించాలని సూచించారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిలో 25 మంది డిశార్జి కాగా, ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top