విధి చిన్నచూపు..

Mother And Child Died In Mahabubnagar - Sakshi

ఒకేరోజు తల్లీ బిడ్డ మృతి

జనరల్‌ ఆస్పత్రిలో బాలింత, నిలోఫర్‌లో శిశువు మృత్యువాత

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రైం: తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసింది.. ఇక చివరి క్షణాల్లో కాన్పు అయి బిడ్డను కళ్లరా చూసుకోవాలని తపించింది. కానీ విధి అనుకోవాలో.. వైద్యుల నుంచి సరైన చికిత్స అందకపోవడమో కానీ ఒకే రోజు తల్లి, బిడ్డ మృతి చెందారు. ఈ ఘటన పాలమూరులో అందరిని కలిచివేసింది. రెండో కాన్పు కోసం జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో ఆడ్మిట్‌ అయ్యింది ఓ గర్భిణి. నార్మల్‌ కాన్పు ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యంగా లేదని హైదరాబాద్‌ రెఫర్‌ చేశారు. అయితే గురువారం జనరల్‌ ఆస్పత్రిలో తల్లి..నిలోఫర్‌ ఆస్పత్రిలో శిశువు మృతి చెందారు. దీంతో కుటుంబానికి తీరాని శోకం మిగిలింది. 

రెండో కాన్పు కోసం ఆస్పత్రికి...
జడ్చర్ల పట్టణ కేంద్రంలోని పాతబజార్‌కు చెందిన యాదమ్మ కాన్పు కోసం రెండు రోజుల కిందట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఆడ్మిట్‌ అయ్యింది. బుధవారం సాయంత్రం నొప్పులు రావడంతో ఆమెకు లెబర్‌ రూంలో నార్మల్‌ డెలవరీ చేయడం జరిగింది. పుట్టిన శిశువు ఆరోగ్యంగా లేదని వైద్యులు హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేయడం వల్ల అక్కడి తీసుకువెళ్లారు. ప్రసవం అయిన తర్వాత యాదమ్మ గర్భసంచి ముడుచుకోవాలి కానీ అలాకాక రక్తస్రావం ఆగలేదు.

అర్ధరాత్రి తర్వాత మళ్లీ సర్జరీ చేసి ఆమె గర్భసంచి తొలగించారు. అయినా ఆమె తీవ్ర రక్తస్రావం కావడం జరిగింది. ఆరు ఫ్యాకెట్ల బ్లడ్‌ను ఎక్కించిన కూడా ఫలితం లేకుండా రక్తం వెళ్లడంతో గురువారం ఉదయం యాదమ్మ మృతి చెందింది. ఇక్కడ తల్లి యాదమ్మ మృతిచెందిన కొంత సమయానికి నిలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవజాత ఆడ శిశువు కూడా మృతి చెందింది. తల్లీ, బిడ్డ ఒకేరోజు మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదఛాయాలు అలముకున్నాయి.

బాలింత యాదమ్మ మృతిపై జనరల్‌ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామకిషన్‌ను వివరణ కోరగా అధిక రక్తస్రావం అవుతుంటే వైద్యులు ప్రయత్నించారని, అయినా కంట్రోల్‌ కాలేదని, సర్జరీ చేసి గర్భసంచి తొలగించారన్నారు. కానీ చివరి దశలో కూడా రక్తస్రావం ఆగకపోవడం వల్ల మృతి చెందిందని వివరించారు.

ఆస్పత్రి వర్గాల హడావుడి
జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో బాలింత యాదమ్మ మృతిచెందగా..మృతదేహాం ఎక్కువ సేపు ఆస్పత్రి ఆవరణలో ఉంటే ఆందోళనలు చేపడతారనే ఉద్దేశ్యంతో వారిని హడావుడి చేసి త్వరగా పంపాలనే ప్రయత్నం చేశారు. నిబంధనల ప్రకారం మృతదేహాలను పార్ధీవవదేహ అంబులెన్స్‌లో తరలించాలి. కానీ వీళ్లు మాత్రం మరో అంబులెన్స్‌లో తరలించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top