అందని పెళ్లి కానుక ..

Money Problems For Shaadi Mubarak Scheme - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ప్రతి ఆడపిల్లకు ఆసరాగా నిలుస్తామని, శుభలేకతోనే కల్యాణలక్ష్మి డబ్బులు అందజేస్తామని ప్రజాప్రతినిధులు చెప్పిన మాట నీటిమూటగానే మిగిలిపోతోంది. కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్‌ పథకాలు లబ్ధిదారులకు అందడం లేదు. ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం తరఫున రూ 1,00, 116 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకాల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ప్రతి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో సంబంధిత ఆర్డీఓలు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్‌లను అందించాలి. నిధులు కేటాయింపులు లేకపోవడంతో గత కొన్ని రోజులుగా పంపిణీ జరగడంలేదు. దీనితో పాటు రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల్లో బిజీగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్నత స్థాయి అధికారులు శ్రద్ధ చూపితేనే పెండింగ్‌లో పథకాలకు మోక్షం కలుగనుంది.

సకాలంలో అందని ఆర్థిక సాయం
ఆడపిల్లల తల్లితండ్రులకు బాసటగా నిలువాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సకాలంలో డబ్బులు అందక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ఆర్థిక సహాయం రాకపోవడంతో ఎదురుచూపులు చూస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ మూబారక్‌కు పెళ్లికి ముందే దరఖాస్తు చేస్తే పెళ్లి నాటికి అందించాలని ప్రభుత్వ ఉద్దేశం. కానీ దాదాపు ఎక్కడ పెళ్లి నాటికి ఆర్థిక సాయం అందిన దాఖలాలు లేవు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వస్తుంది కదా అని పెళ్లి కోసం అప్పులు చేస్తున్నారు.

పెండింగ్‌లో 1720 దరఖాస్తులు
కల్యాణలక్ష్మి, షాదీమూబారక్‌ దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా 1720 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కల్యాణలక్ష్మివి 1601, షాదీమూబారక్‌వి 119 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నర్సంపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 567 కల్యాణలక్ష్మి, 18 షాదీమూబారక్, వరంగల్‌ రూరల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో కల్యాణలక్ష్మి 495, షాదీ ముబారక్‌ 64, పరకాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలలో 539 కల్యాణలక్ష్మి, షాదీమూబారక్‌ 37 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల కేటా యింపు లేకపోవడంతో సాయం అందడం లేదు.

ఈ ఫొటోలో కనబడుతున్న మహిళది దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామం. అత్యంత నిరుపేద. కూలీకి పోతేగాని పూటగడవదు. ఈమెకు ఒక్కగానొక్క కూతురు శ్రీలత. కష్టపడి కూతురును డిగ్రీ చదివించింది. 21 సంవత్సరాలు పూర్తి కాగానే గత సంవత్సరం ఏప్రిల్‌ 27న పెళ్లి చేసింది. కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసింది. పలుమార్లు అధికారులు అడిగిన కాగితాలు అన్నీ ఇచ్చింది. ఏడాది గడిచింది. నేటికి ఒక్క పైసా రాలేదు. కళ్యాణలక్ష్మి డబ్బులు వస్తాయి కదా అని తెలిసిన వాళ్లను బతిమిలాడి అప్పు తెచ్చి బిడ్డకు వస్తువులు కొనిపెట్టింది.  తెచ్చిన అప్పుపై ఇప్పటికే 20 వేల వడీ ్డకట్టింది. ఇప్పుడు కూతురు గర్భిణీ.. చేతిలో చిల్లిగవ్వ లేదు. పాలకులు, అధికారులు కనికరించి కల్యాణలక్ష్మి డబ్బు వచ్చేలా చూడాలని వేడుకుంటోంది.

బడ్జెట్‌ రాగానే చెక్కులు అందిస్తున్నాం
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కోసం వచ్చిన దరఖాస్తులన్ని పరిశీలిస్తున్నాం. బడ్జెట్‌ కేటాయించగానే వారికి వారికి ట్రెజరీ నుంచి చెక్కులను అందిస్తున్నాం. వెంటనే వెంటనే దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. –రవి, ఆర్డీఓ, నర్సంపేట  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top