ముమ్మర తనిఖీలు

Money And Alcohol Caught in Telangana Elections - Sakshi

ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు

పోలీసు బలగాల మోహరింపు అడుగడుగునా తనిఖీలు

పట్టుబడుతున్న నగదు, మద్యం

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నగదు, మద్యం తరలిస్తూ పట్టుబడుతున్నారు. ఎన్నికల బందోబస్తుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులతో పాటు కేంద్ర సాయుధబలగాలను వినియోగిస్తున్నారు. పాతబస్తీ,నేరెడ్‌మెట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో బందోబస్తు విధుల్లో పాల్గొన్న సిబ్బందికి కమిషనర్లు అంజనీకుమార్, మహేష్‌భగవత్, సజ్జనార్‌ దిశానిర్దేశం చేశారు.

సాక్షి, సిటీబ్యూరో  ,చాంద్రాయణగుట్ట: హైదరాబాద్‌ నగరంలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. పురానీహవేళీలోని పాత పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి తనిఖీలను విస్తృతం చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా 4587 లైసెన్స్‌డ్‌ తుపాకులను డిపాజిట్‌ చేసుకున్నామన్నారు. ఆధారాలు చూపని రూ.27 కోట్ల నగదు, రూ.2.5 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఎస్సై స్థాయి అధికారి ఘటనా స్థలంలోనే ఇ–పెట్టి కేసు నమోదు చేసేలా ఎలక్ట్రానిక్‌ ప్యాడ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 4275 మందిని బైండోవర్‌ చేశామన్నారు. 165 కోడ్‌ ఉల్లంఘన కేసులు నమోదు కాగా, అందులో 146 ఎఫ్‌ఐఆర్‌లు చేసినట్లు ఆయన వివరిచారు. రౌడీలు బెదిరింపులకు పాల్పడడం, తుపాకుల వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజలు భయం లేకుండా, ప్రశాంతంగా తమ ఓటు వినియోగించుకోవాలని సూచించారు.

బందోబస్తు సిబ్బందికి అన్ని సౌకర్యాలు
గచ్చిబౌలి: ఎన్నికల పోలింగ్‌ బందోబస్తును క్రమశిక్షణతో నిర్వహించాలని సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ సిబ్బందిని ఆదేశించారు. గురువారం గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో బందోబస్తుకు వెళ్లే సిబ్బందిని స్వయంగా కలిసి కరచాలనం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... బందోబస్తులో సౌకర్యాల కోసం రాజకీయ పార్టీల సహకారం తీసుకోరాదని, ప్రభుత్వమే అన్ని సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు, ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు పాల్గొన్నారు.      

రూ.40 లక్షల నగదు పట్టివేత
గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీసులు బుధవారం రాత్రి రూ.40 లక్షలు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఐడీబీఐ బ్యాంకు ఆవరణలో కేబీ వేణుగోపాల్‌రాజు, ఎం.అశోక్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తులు రూ. 40 లక్షల నగదు తీసుకెళుతుండగా ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. వీరు కొండాపూర్‌లోని జయశ్రీదేవి హోమ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ యాజమాని వెంకటేశ్వర్‌రావు వద్ద పని చేస్తున్నట్లు తెలిపారు. నగదుకు సంబందించి ఆధారాలు చూపక పోవడంతో ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ పార్టీ నేతకు చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

చిలకలగూడలో రూ. 4 లక్షలు స్వాధీనం
చిలకలగూడ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు రూ. 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొంగుళూరు గేట్‌కు చెందిన కర్నాటి సునీల్‌ బుధవారం అర్ధరాత్రి ఇన్నోవాలో వెళుతుండగా చిలకలగూడ గాంధీ చౌక్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ వరుణ్‌కాంత్‌రెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పాలిథిన్‌ బ్యాగులో  రూ. 4 లక్షల నగదును గుర్తించారు. నగదు సంబందించి ఆధారాలు లేకపోవడంతో కారు డ్రైవర్‌ సునీల్‌ను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. సదరు వాహనం చంపాపేటకు చెందిన ప్రకాశ్‌ముదిరాజ్‌దిగా గుర్తించారు. కోర్టు అనుమతితో సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. 

మద్యం బాటిళ్లు స్వాధీనం
చైతన్యపురి: కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను సరూర్‌నగర్‌ పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ రంగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సరూర్‌నగర్‌ ఓల్డ్‌ పోస్టాఫీస్‌ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు కారులో 144 క్వార్టర్‌ బాటిళ్లు గుర్తించారు.మద్యాన్ని తరలిస్తున్న బైరామల్‌గూడకు చెందిన రాఘవేందర్‌గౌడ్, సరూర్‌నగర్‌కు చెందిన మాచగోని కృష్ణలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మద్యం బాటిళ్లతో పాటు కారును సీజ్‌ చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

ఆర్టీసీ బస్సులో...
ఘట్‌కేసర్‌: ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు మండలంలోని కేపాల్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఆర్టీసీ బస్సులో గురువారం రూ.3,04,000 స్వాధీనం చేసుకున్నారు. కేపాల్‌ జాతీయ రహదారిపై తనిఖీ చేస్తుండగా భువనగిరి నుంచి హైదరాబాద్‌ వెళుతున్న ఆర్టీసీ బస్సులో దత్తాద్రి అనే వ్యక్తి నుంచి నగదు స్వాధీనం చేసుకొని ఎస్‌ఎస్‌టీ బృందానికి అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘవీర్‌రెడ్డి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top