కమీషన్ల కాకతీయగా మార్చేశారు

Mission Kakatiya becoming Commission Kakatiya

కల్వకుర్తి ప్రాజెక్టు చెరువులు నింపడానికి కాదు  

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పనులు చేపట్టాలి  

జంగారెడ్డిపల్లి నుంచి నాగిళ్ల వరకు సాగునీటి కోసం మలిదశ ఉద్యమం

రైతు సమస్యల పరిష్కారంలో సర్కారు విఫలం

చెరువులను పరిశీలించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి

తలకొండపల్లి(కల్వకుర్తి): మిషన్‌ కాకతీయ.. కమీషన్ల కాకతీయగా మారిందని, కల్వకుర్తి ప్రాజెక్టు వలన ప్రజలకు ఒరిగిందేమీలేదని, నల్లగొండకు నీళ్లు, కల్వకుర్తికి కన్నీళ్లే మిగిలాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి ధ్వజమెత్తారు. మంగళవారం మండల పరిధిలోని చంద్రధనలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి మండలంలోని జంగారెడ్డిపల్లి నుంచి నాగిళ్ల వరకు కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి సాగునీరు పారించేందుకు మలిదశ ఉద్యమం చేపడతామన్నారు. లక్ష్మీదేవి రిజర్వాయర్‌ పనులు యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఫసల్‌ బీమా యోజన గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.  

ముఖ్యమంత్రి కనీసం రైతు కుటుంబాలను పరామర్శించలేదు
ఇటీవల కురిసిన భారీ వర్షానికి నిండిన చెరువులు, తెగిన కుంటలను ఆచారి పరిశీలించారు. నల్లచెరువుతో పాటు, తెగిన గొల్లకుంట, మోత్కుకుంట, సాయిరెడ్డికుంట, మోదోనికుంట, పెద్దకుంటలను ఆచారి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పంటలు దెబ్బతిని రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం కనీసం వారిని పలుకరించిన పాపాన పోలేదని.. పైగా ఆత్మహత్యకు పాల్పడినవాళ్లు రైతులే కాదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ. 790 కోట్లు అందజేస్తే నయాపైపా కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు. సకాలంలో బ్యాంక్‌లు రుణాలు మంజూరు చేయకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోయారన్నారు.

 పంట పొలాలకు సాగునీరందించేందుకు రూపొందించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రభుత్వం చెరువులు నింపే పథకంగా మార్చిందని ఎద్దేవా చేశారు. 1993లో ఎడ్లబండి ద్వారా ఉద్యమాలు చేపట్టామని.. అదేవిధంగా జంగారెడ్డిపల్లి నుంచి నాగిళ్ల వరకు సాగునీరు పారించేందుకు మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన చెప్పారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పనులు పూర్తయితే కల్వకుర్తి, చేవెళ్ల, షాద్‌నగర్, పరిగి మండలాలకు సాగునీరు వచ్చే అవకాశముందని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్టుల పనులు చేట్టలేదని దుయ్యబట్టారు. లక్ష్మీదేవి ప్రాజెక్టు పనులు యుద్ద ప్రాతిపాదికన చేపట్టి ఈ ప్రాంత రైతంగానికి మేలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు కుమార్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, సూర్యనాయక్, రమేష్, మహేష్, హరికృష్ణ, శ్రీకాంత్, చంటి, తిరుపతి, రాజు, శ్రీశైలం, ఉదయ్, శేఖర్, నర్సింహగౌడ్, మనోహర్, హరికాంత్, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top