ఆలస్యం చేస్తే కాంట్రాక్టులు రద్దు

Mission Bhagiratha Works CM KCR Warning To Contractors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మిషన్‌ భగీరథ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో సవాల్‌గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయని వర్క్‌ ఏజెన్సీల కాంట్రాక్టు రద్దు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడదని హెచ్చరించారు. పనుల జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టంచేశారు. గ్రామాలకు నీటి సరఫరా చేసే పనులతోపాటు గ్రామాల్లో అంతర్గతంగా సరఫరా చేసే పనులను సమాంతరంగా చేయాలని చెప్పారు. కొన్నిచోట్ల ఓహెచ్‌ఎస్‌ఆర్‌(ట్యాంకుల) పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం కాలేదన్న నెపంతో గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం ఆపాల్సిన అవసరం లేదని, వాటి పనులను కొనసాగించాలని సూచించారు. పైపులు, నల్లాలు, ఇతర సామగ్రిని నిర్మాణ ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. రేయింబవళ్లు కష్టపడుతూ, శరవేగంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుని మిషన్‌ భగీరథలోనూ వేగం పెంచాలన్నారు. మిషన్‌ భగీరథపై ముఖ్యమంత్రి శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎంపీ బాల్క సుమన్, టీఎస్‌ఐఐడీసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ సురేందర్‌ రెడ్డి, సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు ఇందులో పాల్గొన్నారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. 

పనుల నాణ్యతలో రాజీ వద్దు 
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలోని దాదాపు 25 వేల ఆవాస ప్రాంతాలకు ప్రతిరోజు సురక్షిత మంచినీటిని సరఫరా చేసేలా మిషన్‌ భగీరథ పథకం చేపడుతున్నామని అసెంబ్లీలో మాటిచ్చినట్లు సీఎం ఈ సందర్భగా గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పనులు వేగంగా జరగాలన్నారు. ‘‘ఇప్పటికే 12 వేలకు పైగా గ్రామాలకు మంచినీటి సరఫరా జరుగుతోంది. మిగతా గ్రామాలకు ఆగస్టు చివరినాటికి పూర్తి కావాలి. అంతర్గత పనులనూ త్వరితగతిన పూర్తి చేయాలి. అవసరమైతే టీంలను పెంచుకొని మూడు షిఫ్టులు పనిచేయాలి. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇంజనీరింగ్‌ అద్భుతం. ఈ ప్రాజెక్టును బాగా నిర్మిస్తే వర్క్‌ ఏజెన్సీలకు కూడా మంచి       పేరు వస్తుంది. ఇది ఆ కంపెనీలకు దేశంలో మరిన్ని మెగా ప్రాజెక్టులు చేపట్టడానికి అనుభవంగా, అర్హతగా మారుతుంది. అతిపెద్ద ప్రాజెక్టు కాబట్టి మొదట్లో కొన్ని తప్పులు దొర్లడం సహజం. ఆ తప్పులను వెంటవెంటనే సవరించుకుంటూ పోవాలి.

మిషన్‌ భగీరథ తెలంగాణ భవిష్యత్‌ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టు. కొద్దికాలం పాటు కాంట్రాక్టర్లు పనులు నిర్వహించినా, ప్రభుత్వ అధికారులు, ఇంజనీర్లే దీన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాబట్టి అధికారులు మొదటి నుంచీ దీనిపై శ్రద్ధ పెట్టాలి. పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు. పకడ్బందీగా పనులు చేయించాలి. విద్యుత్‌ సరఫరాలో జరిగే హెచ్చు తగ్గులను సమీక్షించేందుకు మిషన్‌ భగీరథ కోసం ఏర్పాటు చేసిన సబ్‌ స్టేషన్ల వద్ద అవసరమైన సిబ్బందిని నియమించాలి’’అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లలో మినిమమ్‌ డ్రాయింగ్‌ డౌన్‌ లెవల్‌ (ఎండీడీఎల్‌) నిర్వహించాలని, తాగునీటికి అవసరమయ్యే నీటిని రిజర్వ్‌ చేసిన తర్వాత సాగునీటికి విడుదల చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. అగ్రిమెంట్‌లో పేర్కొన్న దాని కన్నా అదనంగా పడే జీఎస్టీని ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top