‘మిషన్‌’ పనుల్లో జాప్యం తగదు

minister warns officers negligence in mission bhagiratha works - Sakshi

సమీక్ష సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి

ప్రణాళికలు లేకుండా మార్చి నాటికి పూర్తి చేస్తామనడం ఎంత వరకు సమంజసం

కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్యేలు

సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి : మిషన్‌ భగీరథ పనుల్లో జాప్యం తగదని, పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌లోని ఎలిమినేటి మాధవరెడ్డి తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో రంగారెడ్డి జిల్లా మిషన్‌ భగీరథ సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్‌ రఘునందర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మహేందర్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనుల్లో అధికారులు అలసత్వం వహించరాదన్నారు. పనులు ఏ మేరకు పూర్తయ్యాయి.. ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పాల్సిన అధికారులు తమ ఇష్టానుసారం మార్చి చివరి నాటికి పూర్తి చేస్తామనడం ఎంతవరకు సమంజసమని మంత్రి ప్రశ్నించారు.

శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ నుంచి ముచర్ల ప్రాజెక్టుకు మార్చి 1 వరకు 70 ఎంఎల్‌డీ కెపాసిటీ గల ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు అందించేందుకు ప్రణాళికలను పూర్తి చేసుకోవాలని సూచించారు. ముచర్ల ప్రాజెక్టు నుంచి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, షాద్‌నగర్‌ నియోజకవర్గాలకు నీరును అందించే ప్రయత్నం చేయాలన్నారు. మిషన్‌ భగీరథ పనులలో భాగంగా షాద్‌నగర్‌ ప్రాంతంలో భూసేకరణ చేయడంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారని, అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకొని ముందుకు సాగాలన్నారు. మిషన్‌ భగీరథ పనులలో పైపులైన్‌ నిర్మాణాలలో ఎలాంటి ఆం దోళనలు జరగకుండా చూడాలన్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మకై పనులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, అంజయ్యయాదవ్, ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలు అన్నారు. మిషన్‌ భగీరథ పనులు చేపట్టిన పైపులైన్‌ నిర్మాణంతో పాటు జాయింట్‌ పనులను కూడా వెంటనే చేపట్టకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు.

లబ్ధిదారుడికి మేలుజాతి జీవాలను పంపిణీ చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యేలు పశుసంవర్థక శాఖ అధికారులకు సూచించారు. ఈ మేరకు కలెక్టర్‌ రఘునందన్‌రావు మాట్లాడుతూ... రూ.1.11 లక్షల విలువ గల ఆరోగ్యకరమైన జీవాలను అందిస్తామని, గ్రామీణ ప్రాంతాలలో జీవాల పెంపకానికి అనుగుణంగా 4–5 ఎకరాలలో షెడ్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్, నరేందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఆంజనేయులు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మిషన్‌ భగీరథ సమీక్ష అనంతరం బ్యాంకు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సబ్సిడీ రుణాలను అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి లబ్ధిదారుడికి స్థానికంగా ఉన్న అన్ని జాతీయ బ్యాంకులు సకాలంలో రుణాలను అందించి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో లీడ్‌ బ్యాంకు ఎల్‌డీఎం శాస్త్రీ, ఆర్‌బీఐ, ఎస్‌బీఐ అధికారులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top