గ్లోబల్‌ తెలంగాణ

Minister KTR Review Over IT Department - Sakshi

రాష్ట్రానికి ప్రపంచ స్థాయి కంపెనీలు

ఫుడ్‌ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, ఐటీ రంగాల్లో పెట్టుబడి

ఐటీ, పరిశ్రమలు, అనుబంధ శాఖల అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ స్థాయి కంపెనీల పెట్టుబడులతో పారి శ్రామిక, ఐటీ రంగాలకు చిరునామాగా మారిన తెలంగాణకు మరిన్ని ప్రపంచ స్థాయి కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపుతున్న అగ్రశ్రేణి కంపెనీలు ఇప్పటికే ప్రభు త్వానికి ప్రతిపాదనలు అందించినట్లు తెలిపారు. మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్‌.. శుక్రవారం ఐటీ, పరిశ్రమలు, అనుబంధ శాఖల విభాగాధిపతులతో ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. కాగా, ఐటీ, పారిశ్రామిక రంగానికి సంబంధించిన పెట్టుబడులపై మరికొన్ని కంపెనీలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్‌ మరియు ఐటీ రంగాల్లో రాబోయే కొద్ది నెలల్లోనే భారీ పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వివిధ సంస్థలు సమర్పించిన పెట్టుబడుల ప్రతిపాదనలపై సమీక్షించారు. కాగా, వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌ ద్వారా అనుమతులు పొందిన పరిశ్రమలకు అక్టోబర్‌లో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్న కంపెనీలకు పూర్తి సహకారం అందించాలని, పెట్టుబడుల ద్వారానే ఉద్యోగావకాశాల కల్పన మెరుగవుతుందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ టీఎస్‌ఐఐసీ.. ఫార్మాసిటీ, జహీరాబాద్‌ నిమ్జ్, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు, సిరిసిల్ల అప్పారెల్‌ పార్కులతో పాటు.. వివిధ పారిశ్రామిక, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కుల పురోగతిపై కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయిన పారిశ్రామిక పార్కుల్లో మరిన్ని కంపెనీల ఏర్పాటుతో పాటు, త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ఐటీ శాఖ పరిధిలో జరుగుతున్న కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించిన కేటీఆర్‌.. ఐటీ రంగంలో ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన అభివృద్ధి సాధించిందని, ఈ రంగంలో హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు వచ్చాయన్నారు.

రాష్ట్రంలో ఐటీ రంగం పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌.. రాబోయే నాలుగేళ్ల కాలానికి విభాగాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలతో కూడిన నివేదికను అందించాలని కోరారు. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే అంశాన్ని సవాలుగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులు తేవడం లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్‌ నదీం అహ్మద్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, టీఎస్‌ఎండీసీ ఎండీ మల్సూర్, టెక్స్‌టైల్స్‌ కమిషనర్‌ శైలజా రామయ్యర్, పరిశ్రమలు, ఐటీ శాఖల విభాగాధిపతులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top