మహానగరం ఇక విశ్వనగరం: కేటీఆర్‌

Minister KTR Laid Foundation Over New Flyovers In Hyderabad - Sakshi

రూ. 426 కోట్లతో చేపట్టిన రెండు ఫ్లై ఓవర్లకు మంత్రి శంకుస్థాపన

ఇందిరాపార్క్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మీదుగా వీఎస్టీ వరకు స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం

రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు రూ.76 కోట్లతో 900 మీటర్ల బ్రిడ్జి నిర్మాణం

లాక్‌డౌన్‌ సమయంలో నాలుగు రెట్ల అభివృద్ధి పనులు పూర్తి

రూ.6 వేల కోట్లతో నగరంలో రోడ్ల పనులు

కోట్లాది రూపాయలతో ఫ్లై ఓవర్లు, స్కైవేలు

హైదరాబాద్‌: మహానగరం మణిహారాలసమాహారంగా రూపుదాల్చుతోంది. ట్రా‘ఫికర్‌’ లేకుండా ఇప్పటికే నిర్మించిన ఫ్లైఓవర్లకు మరో రెండు ఫ్లై ఓవర్లు తోడుకానున్నాయి. ఇందిరాపార్క్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ మీదుగా వీఎస్టీ వరకు నిర్మించబోయే స్టీల్‌ బ్రిడ్జిని, రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు మరో బ్రిడ్జిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌లతో కలసి మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఇందిరాపార్కు వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ మహానగరంగా కీర్తిగాంచిన హైదరాబాద్‌ విశ్వనగరంగా పురుడుపోసుకుంటోందని అన్నారు. ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్టీ వరకు స్టీల్‌బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్‌ దీర్ఘకాలికంగా ఉందని, అది తమ ప్రభుత్వ హయాంలో నెరవేరుతుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

రూ.426 కోట్ల ఎస్‌ఆర్‌డీపీ నిధులతో చేపట్టిన రెండు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేసుకున్నామని, ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు రూ.350 కోట్లతో 2.6 కిలోమీటర్ల స్టీల్‌ బ్రిడ్జి, రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు రూ.76 కోట్ల వ్యయంతో 900 మీటర్ల బ్రిడ్జి అందుబాటులోకి రానుం దని చెప్పారు. నగరంలో మరో రూ.6 వేల కోట్ల ఎస్‌ఆర్‌డీపీ నిధులతో పనులు నడుస్తున్నాయన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు నాలుగురెట్ల వేగంతో కోట్లాది రూపాయల నిర్మాణపనులు పూర్తి చేశామని వివరించారు. హైదరాబాద్‌ రహదారులపై రద్దీ తగ్గాలనే ఉద్దేశంతో ఎస్‌ఆర్‌డీపీ, హైదరాబాద్‌ రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా కొత్త లింక్‌ రోడ్లు, మిస్సింగ్‌ రోడ్లు నిర్మించుకుంటూ ముందుకుపోతున్నామని వివరించారు. నిర్వహణ పటిష్టంగా ఉండాలని 710 కిలోమీటర్ల ముఖ్యమైన రోడ్లను సీఆర్‌ఎంపీ పేరిట ప్రైవేటు సంస్థలకు అప్పగించామని చెప్పారు.

భవిష్యత్‌లో రక్షణ రంగం స్థలాల అవసరం ఉంటుందని, నాగపూర్, రామగుం డం హైవేలపై సైతం 18 కిలోమీటర్ల మేర స్కైవేలు నిర్మించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పరిశీలిస్తోందని, దీనికి కేంద్రమం త్రి కిషన్‌రెడ్డి సహకారం కావాలని కోరారు. హైదరాబాద్‌లో 36 కిలోమీటర్ల స్కైవేలు నిర్మిస్తే వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమన్నారు. హైదరాబాద్‌ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పాన్ని వేగవంతంగా ముందుకు తీసుకుపోయేందుకు రోడ్ల విస్తరణ, నూతన రోడ్లు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, స్టీల్‌ బ్రిడ్జ్‌ల నిర్మాణాలను ప్రణాళికాబద్ధంగా, విస్తృతంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. కాగా, కోవిడ్‌–19 కట్టడి గురించి కేటీఆర్‌ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ బ్రహ్మాండంగా పనిచేస్తోందని, ఇంకా కొన్ని పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

కలసిమెలసి అభివృద్ధి చేసుకుందాం: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి
ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయాలకతీతంగా కలసిమెలసి అభివృద్ధి చేసుకుందామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. ‘ఇప్పుడు హైదరాబాద్‌ సిటీ అనగానే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సినిమాహాళ్లకు కేంద్రంగా ఉన్న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు మంచి పేరు ఉంది. ఇది చాలా కీలకమైన ప్రాంతం’అని ఆయన అన్నారు. నగరంలోకి పెట్టుబడులు రావాలంటే ట్రాఫిక్‌ సమస్య ఉండొద్దని, పెట్టుబడుదారులు ఇప్పుడు బెంగళూరు వెళ్లాలంటే ట్రాఫిక్‌ సమస్య కారణంగా భయపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జీహెచ్‌ఎంసీ అధికారులు, నియోజకవర్గ కార్పొరేటర్‌లు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top