ప్రతి మగ్గానికి ప్రభుత్వం అండగా ఉంటుంది : కేటీఆర్‌

Minister KTR Distribust Bathukamma Sarees To Women In Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు. సోమవారం ఆయన నల్గొండ వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో చేనేతకు చేయూత ఇచ్చేందుకు కోటి చీరల పంపిణీ జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ తోబుట్టువుగా, పెద్దన్నగా చంద్రుడికో నూలుపోగు అన్నట్లు చిరుకానుకగా చీరలను అందిస్తున్నామని చెప్పారు. కోటి చీరలను నాణ్యతతో నేసి ఆడబిడ్డలకు అందిస్తున్న నేతన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మగ్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

(చదవండి : తీరొక్క కోక.. అందుకోండిక!)

‘బతుకమ్మలాంటి పండుగకు తెలంగాణలోని కోటి మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ తోబుట్టువుగా, పెద్దన్నగా చంద్రుడికో నూలుపోగు అన్నట్లు చిరుకానుకగా చీరలను అందిస్తున్నాం. నచ్చిన చీరలు తేవడం భర్త వల్ల కానే కాదు. కానీ ప్రతి సంవత్సరం చాలా కష్టపడి నేతన్నలు చాలా చక్కని చీరలు తయారు చేశారు. పెద్ద మొత్తంలో చీరల పంపిణీ కార్యక్రమం సవ్యంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 2001, 2002 సంవత్సరాల సమయంలో పోచంపల్లిలో ఏడు మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. నాటి ఉద్యమనాయకుడు, నేటీ సీఎం కేసీఆర్‌.. వారికి సహాయం చేయ్యండి.. బతుకు మీద భరోసా కల్పించాలని అడిగితే నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. స్వయనా కేసీఆరే జోలెపట్టుకుని డబ్బులు అడిగి.. ఏడు కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున సహాయం చేశారు’  అని గుర్తుచేశారు. నేతన్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేత కార్మికులకు చేనేత మిత్ర పేరుతో 50శాతం సబ్సిడీ, నేతన్నకు చేయూత పేరుతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. ప్రతి సోమవారం అధికారులతో చేనేత దుస్తులు ధరించేలా నిర్ణయం తీసుకుని ఆచరిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలు ధరించాలని, తద్వారా నేతన్నలకు జీవనోపాధి కల్పించిన వాళ్లం అవుతాం అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

మినీ ట్యాంక్‌బండ్‌ ఏర్పాటుకు రూ.35 కోట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నల్లగొండ జిల్లా మీద ఎనలేని ప్రేమ ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ చొరవతోనే నల్లగొండలో ఒక మెడికల్‌ కాలేజ్‌, సూర్యాపేటలో ఒక మెడికల్‌ కాలేజ్‌, భువనగిరిలో ఏయిమ్స్‌ మంజూరయ్యాయని చెప్పారు. దండు మల్కాపురంలో ఇండస్ట్రీయల్‌ పార్క్‌ ఏర్పాటు అవుతుందన్నారు. మిర్యాలగూడ దామరచర్లతో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.  ఉదయ సముద్రంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు 35 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా అందరూ అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు.

బతుకమ్మ చీరలు.. ఆడబిడ్డలకు కేసీఆర్‌ ఇచ్చిన కానుక : జగదీశ్‌ రెడ్డి
ఎరరూ అడక్కపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందించి గౌరవిస్తున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కోసం చీరల పంపిణీ జరగడం లేదన్నారు. చేనేతకు పూర్వ వైభవం తెచ్చేందుకు, కార్మికులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌ బూతాన్ని తరిమి కొట్టేందుకు కేసీఆర్‌ తీసుకున్న చొరవే మిషన్‌ భగీరథ రూపకల్పన అని మంత్రి జగదీశ్‌ అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top