వలసలు ఆగినయ్‌

Minister Harish Rao comments at Mission Kakatiya Awards - Sakshi

     ‘మిషన్‌ కాకతీయ’ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి హరీశ్‌

     ప్రజా ఉద్యమంగా చెరువుల పునరుద్ధరణ..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ ప్రజోద్యమంగా సాగిందని.. దాని ద్వారా హరిత తెలంగాణ సాధ్యమైందని నీటి పారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకురాగలిగామని, రైతుల ఆదాయాన్ని పెంచగలిగామని చెప్పారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణ చేయాలన్న సీఎం కేసీఆర్‌ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌లో ‘మిషన్‌ కాకతీయ’అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 2017 ఏడాదికి సంబంధించి మిషన్‌ కాకతీయపై ఉత్తమ కథనాలు రాసిన జర్నలిస్టులకు మంత్రి హరీశ్‌రావు అవార్డులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మిషన్‌ కాకతీయపై సానుకూలంగా రాసిన కథనాలకే కాకుండా, తప్పులు ఎత్తి చూపుతూ రాసిన వార్తలనూ పరిగణనలోకి తీసుకుని అవార్డులు ప్రకటించినట్టు చెప్పారు. పారదర్శకంగా మిషన్‌ కాకతీయ పనులు జరగాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

అదనంగా పది లక్షల ఎకరాలకు నీరు.. 
మిషన్‌ కాకతీయ ద్వారా కాకతీయుల కాలం నాటి చెరువులకు జల కళ వచ్చిందని, పక్షుల కిలకిలలతో చెరువులు చూడచక్కగా ఉన్నాయని, చెరువుల పునరుజ్జీవం ద్వారా రైతుల ఉత్పాదకత పెరిగిందని, వలసలు తగ్గాయని.. ఇలా ఎన్నో కథనాలు వెలువడటంపై హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ వంటి జిల్లాల నుంచి వలస వెళ్లినవారు తిరిగి వెనక్కి వస్తుండటం మిషన్‌ కాకతీయ విజయానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ‘మిషన్‌ కాకతీయ’ద్వారా మూడేళ్లలో 12 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని, పదిలక్షల ఆయకట్టుకు అదనంగా నీళ్లిచ్చామని చెప్పారు. ఇప్పటివరకు 18 వేల చెరువులను పునరుద్ధరించామని, ఈ ఏడాది ఐదో విడత పనులు చేపడతామన్నారు. 

కోటి ఎకరాల లక్ష్యంలో భాగస్వాములు కండి 
నీటి పారుదలశాఖలో కొత్తగా ఎంపికైన 298 మంది ఎలక్ట్రికల్, సివిల్‌ ఇంజనీర్లకు ఈ కార్యక్రమంలోనే మంత్రి అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చారు. విధుల్లోకి వచ్చిన ఇంజనీర్లలో ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వారు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వద్ద పనిచేస్తామని కోరడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణ చేయాలన్న సీఎం కేసీఆర్‌ కల సాకారమయ్యేందుకు అందరం కలిసి పనిచేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఇంజనీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

‘సాక్షి’ జర్నలిస్టులకు అవార్డులు
‘సాక్షి’పత్రిక, టీవీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులు మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా మిషన్‌ కాకతీయ అవార్డులు అందుకున్నారు. సంగారెడ్డి జిల్లా సీనియర్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌గా ఉన్న కల్వల మల్లికార్జునరెడ్డికి ప్రింట్‌ మీడియా విభాగంలో, హైదరాబాద్‌ బ్యూరోలో సీనియర్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్న కొత్తకాపు విక్రమ్‌రెడ్డికి ఎలక్ట్రానిక్‌ మీడియా విభాగంలో అవార్డు వచ్చింది. పురస్కారం కింద ప్రత్యేక మెమెంటో, రూ.50 వేల నగదు, ప్రశంసా పత్రం అందజేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top