ఆదాయం, వృద్ధిలో తెలంగాణ దూకుడు-మంత్రి

minister etela rajendar says telangana growth rate incresed - Sakshi

వృద్ధి రేటు 10.5 శాతం -  ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  దేశ సగటు వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ వృద్ధి రేటు క్రమంగా పెరుగుతోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయ వృద్ధి (జీఎస్‌డీపీ) రేటు 10.5 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అమలు చేసిన అభివృద్ధి పనులతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం పుంజుకుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ సమయం (2014–15)లో 6.8 శాతమున్న జీఎస్‌డీపీ వృద్ధి రేటు సుస్థిరంగా పెరుగుతూ వస్తోందని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు జీఆర్‌ రెడ్డిలతో కలసి ఈటల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘వస్తూత్పత్తులు, తయారీ రంగంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతికూలతను చవిచూసిన జీఎస్‌డీపీ ఆదాయం ఇప్పుడు గణనీయంగా పెరిగింది. 2012–13లో మైనస్‌లో (–15.4) ఉన్న వృద్ధి రేటు 2015–16 నాటికి 9.8కు చేరింది. 

తలసరి ఆదాయం కూడా జాతీయ సగటుతో పోలిస్తే రూ.52 వేలకుపైగా ఎక్కువగా నమోదైంది. 2016–17లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,03,219 కాగా తెలంగాణలో రూ.1,55,612. రాష్ట్రంలో సొంత పన్నుల ఆదాయం సుస్థిరంగా పెరిగింది. 2016–17లో 21.1% ఉండగా, జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక కూడా 17 నుంచి 18 శాతం వృద్ధి ఉంది. తెలంగాణ వృద్ధి దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తోంది. పరిశ్రమలకు, సాగుకు నిరంతర విద్యుత్, నూతన పారిశ్రామిక విధానం, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ముందుండటం తదితరాలు ఆదాయ వృద్ధికి, వృద్ధి రేటుకు అండగా నిలిచాయి. 2017–18లో మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణదే అగ్రస్థానం’’అని వివరించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శనంలో ఇదే వేగం, ఇదే ప్రగతి కొనసాగుతాయని మంత్రి ధీమా వెలిబుచ్చారు. 2018–19 బడ్జెట్‌ రూపకల్పనపై శాఖలవారీ కసరత్తు పూర్తయిందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా సీఎం సమక్షంలో తుది మెరుగులు దిద్దుతామని చెప్పారు. గతేడాది ప్రవేశపెట్టిన రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్‌కు తోడు కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాధాన్యంగా ఎంచుకున్న మిషన్‌ భగీరథ, సాగుకు 24 గంటల విద్యుత్తు తదితరాలపై భారీగా నిధులు వెచ్చించామన్నారు. కేంద్రం ఈ బడ్జెట్‌లోనైనా తెలంగాణకు తగినన్ని నిధులు కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్‌ సిఫార్సు మేరకు మిషన్‌ భగీరథకు రూ.19 వేల కోట్లు , మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లివ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించాలని ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కలసి కోరాం. గిరిజన, హార్టి వర్సిటీలకు, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌కు తగినన్ని నిధులు కేటాయించాలి’’అని కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top