బిల్లులు అందేనా!

MGNREGA Workers Do Not Get Paid, Mahabubnagar - Sakshi

ఉపాధి హామీ పనులు చేసి 

 రెండేళ్లయినా కూలి ఇవ్వని వైనం

 ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల బిల్లుల పరిస్థితి అంతే.. 

సాక్షి, మల్దకల్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసిన కూలీలందరికీ సకాలంలో కూలి డబ్బులు అందక, కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. పనులు చేసి రెండేళ్లు గడుస్తున్నా.. అధికారులు అప్పుడు, ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారు. దీంతో కూలీలు డబ్బులు రాక, పనులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2016లో మండలంలోని ఉలిగేపల్లిలో దాదాపు 200 మంది కూలీలు కూలి పనులు, వ్యవసాయ పొలాలను చదును చేయడం, ముళ్లచెట్లను తొలగించడంతో పాటు వివిధ ఉపాధి హామీ పనులు చేయగా.. రూ.3 లక్షల 90 వేలకు పైగా బిల్లులు అందాల్సి ఉంది.

    పనులు చేసిన కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించాల్సిన అధికారులు ఇప్పటివరకు ఖాతాలో డబ్బులను జమ చేయకపోవడంతో కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రామ ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో పాటు కూలీలు గతంలో ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్‌ రజత్‌కుమార్‌సైనీ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో విచారణ జరిపించి కూలీలకు డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు కూలీలు అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్‌ బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇంకుడు గుంతల పరిస్థితి...
అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద నిర్మించుకున్న మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల బిల్లులు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఉలిగేపల్లిలో 125 మరుగుదొడ్లు, అమరవాయిలో 40 మంది ఇంకుడు గుంతలు నిర్మించుకోగా.. లబ్ధిదారులకు నేటికీ బిల్లులు అందలేదు. వారితో పాటు నిర్మించుకున్న కొంత మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాగా.. మిగిలిన వారికి నేటివరకు అందలేదు. దాదాపు రూ.2 లక్షలకు పైగా మరుగుదొడ్ల బిల్లులు, లక్షకు పైగా ఇంకుడు గుంతల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో  ప్రస్తుతం లబ్ధిదారులు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి ఆసక్తి కనబర్చడం లేదు. 

మంజూరైన వెంటనే జమచేస్తాం..
ఉలిగేపల్లిలో ఉపాధి కూలీలకు బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. మంజూరైన వెంటనే కూలీల ఖాతాల్లో జమ చేస్తాం. అదే విధంగా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు బిల్లులు విషయమై కూడా ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం.  – రాజారమేష్, ఎంపీడీఓ 

పనులు చేసి రెండేళ్లు గడుస్తుంది..
గ్రామంలో ఉపాధి హామీ పనులు చేసి రెండేళ్లు గడుస్తుంది. ఇప్పటి వరకు అధికారులు బిల్లులు చెల్లించలేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా మార్పు రాలేదు. ఇక వస్తాయన్న ఆశ సన్నగిల్లింది. అధికారులు స్పందించి కూలీలు డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలి.  – రాముడు, ఉలిగేపల్లి 

మరుగుదొడ్లు బిల్లు ఇస్తాలేరు.. 
ఉలిగేపల్లిలో ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించుకుంటే రూ.12 వేలు అందజేస్తామని చెప్పారు. దీంతో అప్పులు చేసి మరీ నిర్మించుకున్నాం. ఇప్పటి వరకు బిల్లులు అందించలేదు. ఇకనైనా అధికారులు స్పందించి మరుగుదొడ్ల బిల్లులు అందిస్తే బాగుంటుంది.       – నర్సింహులు, ఉలిగేపల్లి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top