మావోయిస్టులపై  పోస్టర్‌ ‘యుద్ధం’..! | Sakshi
Sakshi News home page

మావోయిస్టులపై  పోస్టర్‌ ‘యుద్ధం’..!

Published Wed, Jan 30 2019 7:44 AM

Maoist Posters Released In Khammam - Sakshi

ప్రభుత్వాలకు, పోలీసులకు వ్యతిరేకంగా మావోయిస్టులు పోస్టర్‌ ‘యుద్ధం’ సాగించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు, సరికొత్తగా.. మావోయిస్టులపై ‘పోస్టర్‌’ యుద్ధం మొదలైంది...! మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల, తేగడ, కలివేరు, సత్యనారాయణపురం, ఆర్‌.కొత్తగూడెం, కుదునూరు, దేవరాపల్లి, రాళ్లగూడెం తదితర ప్రాంతాల్లో ఆదివాసీ, గిరిజన సంఘాల పేరిట సోమవారం అర్ధరాత్రి ఈ వాల్‌ పోస్టర్లు పడ్డాయి. 

చర్ల: ప్రభుత్వాలకు, పోలీసులకు వ్యతిరేకంగా మావోయిస్టులు పోస్టర్‌ ‘యుద్ధం’ సాగించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు, సరికొత్తగా... మావోయిస్టులపై ‘పోస్టర్‌’ యుద్ధం మొదలైంది...! మావోయిస్టులకు వ్యతిరేకంగా చర్ల మండలంలోని చర్ల, తేగడ, కలివేరు, సత్యనారాయణపురం, ఆర్‌ కొత్తగూడెం, కుదునూరు, దేవరాపల్లి, రాళ్లగూడెం తదితర ప్రాంతాలలో ఆదివాసీ, గిరిజన సంఘాల పేరిట సోమవారం అర్ధరాత్రి ఈ వాల్‌ పోస్టర్లు పడ్డాయి. వాటిలో ఇలా ఉంది.

‘మేధావులు, ప్రజాసంఘాలు, పత్రికావివిమిత్రులు ఆలోచించండి. ఈ రోజు ఆపరేషన్‌ సమాధాన్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు జరుపుతున్న దమనకాండ దేనికి ఉపయోగపడుతుంది..? ప్రభుత్వ, ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తే ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా..? మావోయిస్టులు కేవలం తమ ఉనికిని చాటుకునేందుకు మాత్రమే విధ్వంసాలు సృష్టిస్తున్నారు. విజ్ఞులైన మీరందరూ దీనిని ప్రశ్నించాలి. రోజువారీ పనులు చేసుకోనియకుండా ఆదివాసీలను గత వారం రోజులుగా మావోయిస్టులు హింసిస్తున్నారు.

ప్రతి ఇంటి నుంచి బియ్యం, ఇతర వస్తువులను బలవంతంగా వసూలు చేసి, సభలు.. సమావేశాల పేరిట వారిని ఇబ్బందిపెడుతున్నారు. ఆదివాసీ గ్రామాలలో పాఠశాలలు బంద్‌ చేసి, ఆదివాసీ ప్రజలంతా సమావేశాలకు రావాలని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని వారాంతపు సంతలపై వారం రోజులుగా నిఘా పెట్టారు. వ్యాపారుల నుంచి వస్తువులన్నీ మావోయిస్టులు తీసుకుంటున్నారు. ఆదివాసీ ప్రజలకు ఎటువంటి నిత్యావసర వస్తువులు అందకుండా చేస్తున్నారు. మావోయిస్టుల అనుమతి లేనిదే సంతలు నిర్వహించడానికి వీల్లేదట. పైకి మాత్రం, ఆదివాసీలను పోలీసులు హింసిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి మావోయిస్టులే ఆదివాసీలను హింసిస్తున్నారు. ఆ తప్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మోపుతున్నారు.
 
సోడి సోగయ్య అనే నరహంతకుడి ఆరాచకాలు ఇంకా ఎన్నాళ్లు ...? ఇతడు ఇంతకు ముందు కుర్నపల్లి గ్రామస్తులపై దాడులు చేశాడు. ఇర్పా వెంకటేశ్వర్లును చంపాడు. ఎందుకు చంపిందీ మావోయిస్టులు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. పొట్ట కూటి కోసం ఆర్‌అండ్‌బీ గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తున్న నాగుల నాగేశ్వరావు, నిట్టా రాజ్‌కుమార్, పందెం నాగేశ్వరావు, గగ్గూరి వెంకటేశ్వరావును చెన్నాపురం సమీపంలో మందుపాతర పేల్చి గాయపరిచారు. అదృష్టవశాత్తు వారికి ప్రాణాపాయం తప్పింది. ఒకవేళ చనిపోతే... వారి భార్యాపిల్లల పరిస్థితి ఏమవుతుందో మావోయిస్టు పార్టీ ఆలోచించాలి. దీనికి తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ క్షమాపణ చెప్పాలి. సోడి జోగయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలి.

గతంలో రాళ్లాపురంలో మంత్రాలు చేస్తున్నదనే నెపంతో కుడుం ఉంగి అనే మహిళను మావోయిస్టులు కొట్టి చంపారు. దీనికి కూడా ఆ పార్టీ ఇంతవరకు సమాధానం  చెప్పలేదు. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ కేడర్‌ అంతా ఇక్కడ (తెలంగాణ)లో ఆదరణ కోల్పోయింది. అందుకే వారు ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో తల దాచుకుని, అమాయక ఆదివాసీల ద్వారా ఇతరులపై దాడులు చేయిన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ వదిలి వెళ్లిన తరువాత ఇక్కడి ఆదివాసీ ప్రజలు మంచి జీవనం సాగిస్తున్నారు. మీరు (మావోయిస్టులు) ఛత్తీస్‌గఢ్‌ వెళ్లిన తరువాత అక్కడి ఆదివాసీలకు కష్టాలు మొదలయ్యాయి. మీరు అక్కడ ఉన్నంత కాలం వారి కష్టాలు తీరవు, అభివృద్ధి జరగదు. కాబట్టి, ఆదివాసీ ప్రజలంతా మావోయిస్టులపై తిరగబడి, తరిమికొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం’.

Advertisement

తప్పక చదవండి

Advertisement