మావోయిస్టు దంపతుల లొంగుబాటు

Maoist Couple Surrender In Bhadradri Kothagudem - Sakshi

వీరిపై రూ.4 లక్షల చొప్పున రివార్డు

విలేకరుల సమావేశంలో భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ వెల్లడి

సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ సమక్షంలో మావోయిస్టు పార్టీకి చెందిన దంపతులు మంగళవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. మావోయిస్టు పార్టీ ఇంద్రవెల్లి–ఖానాపూర్‌–మంగి (పాత ఆదిలాబాద్‌ జిల్లా) ఏరియా కమిటీ సెక్రటరీ సోడె నర్సింహారావు అలియాస్‌ మనోజ్, ఆయన భార్య, ఖానాపూర్‌ – మంగీ ఏరియా కమిటీ మెంబర్‌ పొడియం సన్నీ అలియాస్‌ రనిత లొంగిపోయారని తెలిపారు. చర్ల సీఐ సత్యనారాయణ, ఎస్సై ఆలెం రాజు వర్మల నేతృత్వంలో లొంగిపోయినట్లు చెప్పారు. నర్సింహారావు 2007లో వెంకటాపురం ఏరియా కమిటీ సభ్యుడిగా, 2009లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌కు గార్డుగా పనిచేశాడని తెలిపారు.

2017లో ఖానాపూర్‌–మంగి ఏరియా కమిటీ సెక్రటరీగా నియమితుడయ్యాడని చెప్పారు. 2013లో పువ్వర్తిలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పులు, ఛత్తీస్‌గఢ్‌లోని వింపా సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై జరిగిన దాడి, ఛత్తీస్‌ఘడ్‌ బీజాపూర్‌ జిల్లాలోని లంకపల్లిలో జరిగిన ఎదురుకాల్పులు, 2015లో వరంగల్‌ జిల్లా రంగాపూర్‌లో, 2016లో ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా బోటేటోంగ్‌లో, 2018 మార్వాడ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొన్నాడని వివరించారు. చర్ల మండలం కొరకటపాడు గ్రామానికి చెందిన పొడియం సన్నీ 2013లో లచ్చన్న ఆధ్వర్యంలోని ఎల్‌జీఎస్‌లో చేరారని ఎస్పీ తెలిపారు. 2014లో బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ దళంలోకి బదిలీ చేశారని, 2017 డిసెంబర్‌లో ఖానాపూర్‌ – మంగీ ఏరియా కమిటీ మెంబర్‌గా ప్రమోట్‌ చేశారని చెప్పారు.

2016లో ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా బోటేటోంగ్‌ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో, అదే సంవత్సరం పామిడి పోలీస్‌ పార్టీపై జరిగిన దాడిలో, 2018లో మహారాష్ట్ర మార్వాడలో జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొందని తెలిపారు. మావోయిస్టు పార్టీ అనుసరిస్తున్న సిద్ధాంతాలు నచ్చక, మంచి జీవితాన్ని గడపాలని జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు లొంగిపోయారని ఎస్పీ వివరించారు. వీరి ఇరువురిపై రూ.4 లక్షల చొప్పున రివార్డు ఉందని, అంతేకాకుండా ప్రభుత్వ పరంగా అందే సహాయ సహకారాలన్నింటినీ వారి పునరావాసం కోసం అందజేస్తామని చెప్పారు. ఆయన వెంట అడిషనల్‌ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, భద్రాచలం ఏసీపీ రాజేష్‌చంద్ర, చర్ల సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ రాజువర్మ ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top