‘పశ్చిమానికి’ విస్త్తారమైన రోడ్లు | Main roads expansion in West Ranga Reddy district | Sakshi
Sakshi News home page

‘పశ్చిమానికి’ విస్త్తారమైన రోడ్లు

Nov 17 2014 12:41 AM | Updated on Mar 28 2018 11:11 AM

పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రధాన రహదారులు విస్తరణకు నోచుకోనున్నాయి.

తాండూరు: పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రధాన రహదారులు విస్తరణకు నోచుకోనున్నాయి. పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా డబుల్ రోడ్లను నాలుగులైన్ల రోడ్లుగా, సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రోడ్లను వెడల్పు చేయడంతోపాటు పటిష్టం చేసేందుకు రాష్ట్ర సర్కారు దృష్టిసారించింది. ప్రధాన రోడ్లతోపాటు మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లను కూడా అభివృద్ధి చేయనున్నారు.

వికారాబాద్ నుంచి తాండూరు వరకు ప్రధాన ప్రధాన రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని సర్కారు భావిస్తున్నది. ప్రస్తుతం వికారాబాద్ నుంచి తాండూరు వరకు 5.5 మీటర్ల వెడల్పుతో 39 కిలో మీటర్ల రోడ్డు ఉంది. ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువైంది. ఈక్రమంలో ఒకేసారి నాలుగు వాహనాలు వెళ్లేందుకు ఈ రోడ్డును 10 మీటర్ల వెడల్పు చేసి నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించారు. ఈ రోడ్డు విస్తరణకు రూ.40కోట్లు అవసరమవుతాయని ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

తాండూరు నుంచి తొర్మామిడి(బంట్వారం  మండలం)వరకు 23  కిలో మీటర్లు, లక్ష్మీనారాయణపూర్ నుంచి యాలాల మండల కేంద్రం వరకు ఉన్న 7కి.మీ.ల సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చాలని కూడా అధికారులు యోచిస్తున్నారు. ఈ రెండు రోడ్ల విస్తరణకు రూ. 35 కోట్లు అవసరమవుతాయని ఆర్‌అండ్‌బీ అధికా రులు ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో పేర్కొన్నారు. అలాగే మొయినాబాద్ నుంచి మన్నెగుడ వరకు కూడా ఉన్న సుమారు 34 కి.మీ.డబుల్ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చేందుకు అధికారులు ప్రభుత్వానికి రూ.వంద కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపించారు.

ఈ ప్రతిపాదనలకు సంబంధించి తాండూరు ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. సీఎం ఆమోద ముద్రపడగానే నిధులు మంజూరు అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్డు విస్తరణకు నోచుకుంటే ఈ రహదారిపై ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement