ఇన్‌చార్జి డీజీపీగా మహేందర్‌రెడ్డి? 

Mahender reddy as incharge DGP - Sakshi

ముఖ్యమంత్రి సూచనప్రాయ నిర్ణయం!  

10న ఉత్తర్వులు జారీ చేసే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసుశాఖ కొత్త బాస్‌ ఎవరనే అంశానికి తెరపడినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌ శర్మ ఈ నెల 12న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీగా 1986 బ్యాచ్‌ అధికారి, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ఎం. మహేందర్‌రెడ్డి వైపు ప్రభుత్వం మొగ్గుచూపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. డీజీపీగా ఆయన నియామకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సూచనప్రాయంగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

అయితే ప్రభుత్వం అసెంబ్లీ వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల యూపీఎస్సీకి పంపాల్సిన జాబితాపై తుది కసరత్తు చేయకపోవడం, పూర్తిస్థాయి డీజీపీ ప్రక్రియకు కనీసం 2–3 నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రతిపాదిత అధికారుల జాబితా యూపీఎస్సీకి వెళ్లి తిరిగొచ్చే వరకు ఇన్‌చార్జి డీజీపీగా మహేందర్‌రెడ్డిని నియమించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక యూపీఎస్సీకి ప్రతిపాదిత అధికారుల జాబితాను పంపాలని ప్రభు త్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ తొలుత ఇన్‌చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2015 నవంబర్‌ 11న యూపీఎస్సీ నుంచి ప్రతిపాదిత అధికారుల జాబితా ప్రభుత్వానికి తిరిగొచ్చాక ప్రభుత్వం ఆయన్ను నవంబర్‌ 12న పూర్తిస్థాయి డీజీపీగా నియమించింది. ఈ నేపథ్యంలో ఎం. మహేందర్‌రెడ్డిని తొలుత ఇన్‌చార్జి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 10న ఆదేశాలిచ్చే అవకాశం ఉందని సీఎంఓ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 11, 12 సెలవు దినాలు కావడంతో 10వ తేదీనే ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలివ్వొచ్చని తెలిసింది. 

కొత్త కొత్వాల్‌ ఎవరు?.. 
ప్రస్తుతం హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా ఉన్న ఎం. మహేందర్‌రెడ్డి ఇన్‌చార్జి డీజీపీగా నియమితులైతే కొత్త కొత్వాల్‌ రేసులో నిలిచేందుకు అదనపు డీజీపీ హోదాలో ఉన్న అధికారులందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం నగర కమిషనరేట్‌ పరిధిలో మహేందర్‌రెడ్డి తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు, కొత్త టెక్నాలజీ వినియోగం, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కొనసాగించే సామర్థ్యంగల అధికారుల కోసం సీఎం కార్యాలయం, ఇంటెలిజెన్స్‌ విభాగం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో 11 మంది అధికారులు పనిచేస్తున్నారు. 1987 బ్యాచ్‌కు చెందిన వీకే సింగ్, సంతోష్‌మెహ్రా, గోపికృష్ణ వచ్చే ఏడాది జనవరిలో డీజీపీ హోదా పదోన్నతి పొందనున్నారు. దీంతో వారికి నగర కమిషనర్‌ రేసులో ఉండే అవకాశం లేదు.

ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న 1988 బ్యాచ్‌కు చెందిన పూర్ణచందర్‌రావు సీపీ రేసులో పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే 1990 బ్యాచ్‌కు చెందిన శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, రవిగుప్తా, గోవింద్‌సింగ్‌లలో అంజనీకుమార్‌ , గోవింద్‌సింగ్‌ల పేర్లు కమిషనర్‌ రేసులో వినిపిస్తున్నాయి. 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్, రాజీవ్‌ రతన్‌లలో తెలంగాణ అధికారి, ప్రస్తుతం సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌ ప్రధాన రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. వారి తర్వాత 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్‌ పేరు సైతం సీపీ రేసులో వినిపిస్తున్నా జూనియర్‌ అదనపు డీజీపీ కావడంతో ఇస్తారా లేదా అనే దానిపై అనుమానం నెలకొంది. 1989 బ్యాచ్‌కు చెందిన ఉమేష్‌ షరాఫ్‌ కేంద్ర సర్వీసులోని జాతీయ పోలీస్‌ అకాడమీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తుండటంతో ఆయన ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. దీంతో పూర్ణచందర్‌రావు, అంజనీకుమార్, సీవీ ఆనంద్‌లలో ఒకరిని కమిషనర్‌గా ప్రభుత్వం నియమించే అవకాశం ఉందని పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. 

మహేందర్‌రెడ్డి నేపథ్యం ఇదీ... 
ఖమ్మం జిల్లాకు చెందిన ఎం. మహేందర్‌రెడ్డి బీటెక్‌ పూర్తిచేశారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఆయన సర్వీసు ప్రారంభంలో ఏఎస్పీ గోదావరిఖని, గుంటూరులలో పనిచేశారు. అనంతరం నిజామాబాద్, కర్నూలు జిల్లాల ఎస్పీగా, నగర కమిషనరేట్‌లో ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా, నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా డీఐజీ హోదాలో విధులు నిర్వర్తించారు. తదనంతరం సైబరాబాద్‌ కమిషనర్‌ ఏర్పాటు నుంచి నాలుగేళ్లపాటు పనిచేయగా, ఐజీ హోదాలో పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీస్, గ్రేహౌండ్స్‌లో కొద్ది రోజులపాటు పనిచేశారు. 2009 నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా, రాష్ట్ర ఆవిర్భావం నుంచి హైదరాబాద్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top