మరి నేనెక్కడికి వెళ్లాలి?

Madhusudhana Chary Emotional Speech In His Constituency - Sakshi

కంటతడి పెట్టిన మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి

పేదలకు ఇళ్లు కట్టించాకే నేను కట్టుకుంటా అని ప్రమాణం చేశా.. 

అయినా భూపాలపల్లిని విడిచిపెట్టలేనని భావోద్వేగం 

మీడియా పిచ్చోళ్లకు అభివృద్ధి కానరాలేదంటూ చందూలాల్‌ కంటతడి 

ములుగు/భూపాలపల్లి: ‘ఈ సమావేశం అయిపోయాక మీరంతా మీ ఇళ్లకు వెళ్లిపోతారు.. మరి నేను ఎక్కడికెళ్లాలి.. నాకు కనీసం ఇల్లు కూడా లేదు’అని మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి కంటతడి పెట్టారు. సోమవారం భూపాలపల్లిలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘పేదలందరికీ ఇళ్లు కట్టించాకే నేను ఇల్లు కట్టుకుంటా అని ప్రమాణం చేసిన.. మీరంతా ఇళ్లకు వెళ్లిపోతే.. నేను ఎక్కడికెళ్లాలి. అయినా అధైర్యపడను.. నన్ను ఆదరించి ప్రేమ చూపించిన భూపాలపల్లిని విడిచి వెళ్లలేను.

నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నియోజకవర్గంపై ప్రేమ చూపిస్తా’అంటూ గద్గద స్వరంతో మాట్లాడారు. భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. దీంతో సభ మీద, కింద ఉన్న పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు బోరున విలపించారు. అలాగే ములుగులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి చందూలాల్‌ మాట్లాడుతూ మీడియా పిచ్చోళ్లు కావాలని తనపై 15 రోజులపాటు పిచ్చిపిచ్చి వార్తలు రాశారని, వార్తలు రాసిన వారు ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. పత్రికలకు తాను చేసిన అభివృద్ధి కనిపించకపోవడం సిగ్గుచేటని పేర్కొంటూ ఆయన కంటతడిపెట్టారు. ఇదే సభలో ఆయన కుమారుడు ప్రహ్లాద్‌ మాట్లాడుతూ అందరూ తన మనుషులు అనుకుంటే కలసికట్టుగా మోసం చేశారన్నారు. 

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఎమ్మెల్యేల రాయబారం: బాలమల్లు  
ములుగు: తమ పార్టీలో చేరడానికి టీడీపీ, కాంగ్రెస్‌  ఎమ్మెల్యేలు  రాయబారాలు పంపుతున్నారని  పార్టీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి, టీఎస్‌ఐఐసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ గాదరి బాలమల్లు అన్నారు. అయితే.. ఇద్దరు స్వతంత్ర సభ్యులతో కలసి 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిగతావారి అవసరం లేదని సీఎం కేసీఆర్‌ తిరస్కరిస్తున్నారని చెప్పారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగులో ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top