హరిత హరివిల్లు.. నగరంలో నిల్లు!

Low Green Belt In Hyderabad - Sakshi

నగరంలో స్వచ్ఛమైన ప్రాణవాయువు కరువు

పట్టణీకరణకు తగ్గట్లుగా పెరగని గ్రీన్‌బెల్ట్‌

ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే చివరి స్థానంలో హైదరాబాద్‌

సాక్షి, హైదరాబాద్‌ : తోటల నగరంగా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో హరిత హననం జరుగుతోంది. శరవేగంగా విస్తరిస్తున్న రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు, ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వాణిజ్య సముదాయాలతో విశ్వనగరి కాంక్రీట్‌ మహారణ్యంలా మారుతోంది. కాంక్రీట్‌ విస్తరణకు అనుగుణంగా గ్రీన్‌బెల్ట్‌ పెరగకపోవడంతో మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కార్బన్‌డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి ఉద్గారాలతో వాతావరణం త్వరగా వేడెక్కు తోంది. దీంతో స్వచ్ఛ ఆక్సిజన్‌ను.. స్వేచ్ఛగా పీల్చే పరిస్థితి ఉండటం లేదు. ప్రాణవాయువు అందక నగరవాసులు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్‌ (హరిత వాతావ రణం) ఉండాల్సి ఉండగా.. కేవలం 8 శాతమే ఉండటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. 

ఓ వృక్షం.. 260 పౌండ్ల ఆక్సిజన్‌
ఒక భారీ వృక్షం ఏటా 260 పౌండ్ల (సుమారు 118 కిలోలు) ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీల్చుకోవాలంటే నలుగురు సభ్యులున్న ఓ కుటుంబానికి ఇలాంటి నాలుగు వృక్షాల చొప్పున అందుబాటులో ఉండాల్సిందే. కానీ గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆ పరిస్థితి లేదు. మహా నగరంలో ఒక్కో కుటుంబానికి సరాసరిన రెండు చెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితి కారణంగానే నగరవాసులు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందక ఉక్కిరిబిక్కిరయ్యే దుస్థితి తలెత్తింది. ప్రతివ్యక్తికి తలసరిగా అవసరమైన హరిత శాతం (పర్‌హెడ్‌ ట్రీ కవర్‌) జాతీయ స్థాయి సగటు కంటే తక్కువగా భాగ్యనగరంలో ఉండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. జాతీయ సగటు ప్రకారం ప్రతివ్యక్తి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేందుకు, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను గ్రహించేందుకు 10 మీటర్ల హరిత వాతావరణం అవసరం కాగా.. నగరంలో కేవలం 2.6 మీటర్ల హరితం మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ ఏడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. జాతీయ స్థాయి సగటు కంటే అధిక హరిత శాతంతో చండీగఢ్‌ ముందుంది. 12 మీటర్ల తలసరి హరితంతో తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీలో 10.2 మీటర్ల హరితం ఉంది. బెంగళూరులో 10 మీటర్లు, కోల్‌కతాలో 8 మీటర్లు, ముంబైలో 7 మీటర్లు, చెన్నై 6 మీటర్లు, హైదరాబాద్‌లో 2.6 మీటర్లు మాత్రమే ఉంది.

పలు మెట్రో నగరాల్లో గ్రీన్‌బెల్ట్‌ శాతం ఇలా

హైదరాబాద్‌లో 8 శాతమే
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం 1.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్‌ ఉండాలి. కానీ నగరంలో 8 శాతం మాత్రమే ఉంది. సుమారు 12,320 ఎకరాల్లో హరిత వాతావరణం (గ్రీన్‌బెల్ట్‌) అందుబాటులో ఉంది. దీన్ని కనీసం 24,710 ఎకరాలకు పెంచాల్సి ఉంది. అంటే నగర విస్తీర్ణంలో హరితం శాతం కనీసం 16 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. దేశంలో 35 శాతం గ్రీన్‌బెల్ట్‌తో చండీగఢ్‌ తొలిస్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో 20.2 శాతం, గ్రీన్‌ సిటీగా పేరొందిన బెంగళూరులో 19 శాతం, కోల్‌కతాలో 15 శాతం, ముంబైలో 10 శాతం, చెన్నైలో 9.5 శాతం గ్రీన్‌బెల్ట్‌ ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో హరితం 8 శాతానికే పరిమితమైంది. 

ఇలా చేస్తే మేలు.. 

  • నగరంలోని ప్రధాన రహదారులు, 185 చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటాలి. తద్వారా భూగర్భ జల మట్టాలు పెరుగుతాయి. పర్యావరణ కాలుష్యం కూడా బాగా తగ్గుతుంది.
  • విశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్న వారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్‌ ఇచ్చిన తర్వాతే వారికి జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి.
  • నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్‌ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి.

జల వనరులకూ శాపం
మహా నగరంలో చెరువులు, కుంటలకు పట్టణీకరణ శాపంగా పరిణమిస్తోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు లోపల ఉన్న సుమారు 3,500 చెరువులు, కుంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. ఆయా భూములు కబ్జాకు గురవడం, విల్లాలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, బహుళ అంతస్తుల భవంతులు వెలియడంతో జలాశయాలు రోజురోజుకూ చిన్నబోతున్నాయి. పర్యావరణ సంస్థ నీరి (ఎన్‌ఈఈఆర్‌ఐ) 2005–2018 మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకొని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. ఔటర్‌కు లోపల చిన్న, పెద్ద చెరువులు, కుంటల సంఖ్య 3,500 వరకు ఉంది. వీటి విస్తీర్ణం 2005లో సుమారు 30,978 ఎకరాలుగా ఉండేది. తర్వాత రియల్‌ రంగం పురోగమించడం, పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వలసలు అధికమవడంతో శివార్లలో పరిస్థితి మారింది. ఇదే క్రమంలో అక్రమార్కుల కన్ను విలువైన జలాశయాలపై పడింది. జీవో 111 పరిధిలో ఉన్న గ్రామాల్లో చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు, రియల్‌ వెంచర్లు, వాణిజ్య స్థలాలు, బహుళ అంతస్థుల భవంతులు వెలిశాయి. ఒకప్పుడు పచ్చటి పంట పొలాలు, నిండు కుండలను తలపించే చెరువులు, కుంటలతో కళకళలాడిన ప్రాంతాలు ఇప్పుడు కాంక్రీట్‌ మహారణ్యంగా దర్శనమిస్తున్నాయి. 30,978 ఎకరాలుగా ఉన్న చెరువులు, కుంటల విస్తీర్ణం.. 5,641 ఎకరాలకు చేరింది. గత 13 ఏళ్ల కాలంలో సుమారు 80 శాతం తగ్గిపోయింది. ఇందుకు పట్టణీకరణ ప్రభావం ఒక కారణమైతే, రెవెన్యూ, పంచాయతీరాజ్, చిన్న నీటిపారుదల శాఖల నిర్లక్ష్యం మరో కారణంగా ఉందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. 

ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్‌బెల్ట్‌ పెరగదు: జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త
ప్రభుత్వం ప్రారంభించిన మూడో విడత హరితహారంలో నాటిన మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచుతున్నవే ఉన్నాయి. వీటితో నగరంలో గ్రీన్‌బెల్ట్‌ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి, ఆక్సిజన్‌ అందించేవి, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప, రావి, మర్రి, మద్ది, చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్‌బెల్ట్‌ పెరుగుతుంది. అలా ఆక్సిజన్‌ శాతం పెరిగి నగరవాసులకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. సర్కారు హరితహారంతో వల్ల నర్సరీల నిర్వాహకులకే లాభం చేకూరింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top