
సాక్షి, మెదక్: మెదక్ పార్లమెంట్‌కు ఈనెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇటీవల మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఓటర్ల జాబితా సవరణ చేపట్టారు. కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ పూర్తయ్యింది. నూతన జాబితాను అనుసరించి మొత్తం 15,95,272 మంది ఓటర్లు ఉన్నారు.
జిల్లాలో పెరిగిన ఓట్లు 22,758
మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోకజవర్గాలు ఉన్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 15,95,772 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళా ఓటర్లదే పైచేయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,99,958 మంది మహిళా ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 7,95,199 మంది, 115 మంది ఇతరులు ఉన్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. నూతన జాబితా ప్రకారం మెదక్ నియోకజవర్గంలో ఓటర్ల సంఖ్య 2,04,445కు చేరుకుంది. ఇందులో మహిళా ఓటర్లు 1,06,353 మంది ఉండగా.. పురుష ఓటర్లు 98,090, ఇతరులు ఇద్దరు ఉన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో నూతన జాబితాను అనుసరించి మొత్తం 2,10,658 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,06,921 మంది ఉండగా.. పురుషులు 1,02,731 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోకజవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల పరిధిలో 22,758 మంది ఓటర్లు పెరిగారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో 3,92,345 మంది ఓటర్లు ఉండగా.. తాజాగా సవరించిన జాబితాను ప్రకారం ఆ సంఖ్య 4,15,103కు చేరుకుంది.
మెదక్ నియోజకవర్గంలో 12,660 మంది ఓటర్లు పెరగగా, నర్సాపూర్ నియోజకవర్గంలో 10,098 మంది కొత్తగా చేరారు. పెరిగిన ఓటర్లలో అత్య«ధికులు యువకులు ఉన్నారు. మెదక్ జిల్లా అధికారులు కొత్త ఓటర్ల నమోదుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందుకోసం డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రచారం నిర్వహించారు. అలాగే ఓటర్ల నమోదపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 22,758 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు.
పటాన్‌చెరులో 2,99,428 మంది ఓటర్లు
మెదక్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా పటాన్‌చెరు పరిధిలో 2,99,428 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో 2,48,080 మంది ఓటర్లు ఉండగా.. సిద్దిపేట నియోజకవర్గంలో 2,17,831, సంగారెడ్డిలో 2,16,407, నర్సాపూర్ నియోజకవర్గంలో 2,10,658, మెదక్‌లో 2,04,445, దుబ్బాకలో 1,98,423 మంది ఓటర్లు ఉన్నారు.