29 కిలోమీటర్లు...26 నిమిషాలు!

Live Organs Transport in 29 Minits To Airport Green Channel - Sakshi

లక్డీకాపూల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు...

రెండు లైవ్‌ ఆర్గాన్స్‌ తరలించిన వైద్యబృందం

గ్రీన్‌ఛానల్‌తో సహకరించిన ట్రాఫిక్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రి–శంషాబాద్‌లోని విమానాశ్రయం మధ్య ఉన్న 29 కిమీ మార్గాన్ని లైవ్‌ ఆర్గాన్స్‌తో కూడిన అంబులెన్స్‌ కేవలం 26 నిమిషాల్లో అధిగమించింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ ఇచ్చినట్లు అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. నగర ట్రాఫిక్‌ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్‌లెస్‌ సెట్స్‌ సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మోగాయి. లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రిలో ఉన్న డోనర్‌ తన గుండె, ఊపిరి తిత్తులను దానం చేశారని, అవి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి చెన్నైకు చేరాల్సి ఉందని సమాచారం అందింది. చెన్నైలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు ఇవి చేరాల్సి ఉంది. అప్పటికే ఆయా ఆస్పత్రుల్లో వీటిని రిసీవ్‌ చేసుకోవాల్సిన రోగులకు ఆపరేషన్స్‌ మొదలయ్యాయి. లైవ్‌ ఆర్గాన్స్‌తో కూడిన అంబులెన్స్‌ తెల్లవారుజామున 3 గంటలకు లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రి నుంచి బయలుదేరగా అధికారులు అప్రమత్తమై ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దింపారు.

తెల్లవారుజామున 2 గంటల నుంచే ఈ రూట్‌లో ఉన్న జంక్షన్లలో ప్రత్యేక చర్యలు మొదలయ్యాయి. డోనర్‌ ఇచ్చిన గుండె, ఊపిరి తిత్తులతో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్‌ విమానాశ్రయం వరకు ఉన్న 29 కిమీ దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్‌ పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు. తెల్లవారుజామున సాధారణ రోడ్లలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండకపోయినప్పటికీ... ఎయిర్‌పోర్ట్‌ రూట్‌లో కచ్చితంగా ఉంటుంది. దీనికితోడు ఇతర జంక్షన్లలోనూ దూసుకువచ్చే వాహనాల వద్ద ప్రమాదాలు, ఆటంకాలు లేకుండా చూసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఓ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలోని బృందం అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా వెళ్లడానికి సిద్ధమైంది. బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లోని ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 2.58 గంటలకు ‘లైవ్‌ ఆర్గాన్స్‌ బాక్స్‌’తో కూడిన అంబులెన్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌ వే మీదుగా సరిగ్గా 3.24 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్‌ పోలీసులు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కాపు కాశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న విమానంలో ఈ రెండు లైవ్‌ ఆర్గాన్స్‌ చెన్నై వెళ్లిపోయాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top