చదువులమ్మ చెంత అపచారం

Leaders of the ruling party special prayers at basara temple - Sakshi

      మూసి ఉన్న ఆలయంలో..అమ్మవారు సేదదీరే సమయంలో.. ధర్మకర్త ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు 

     మహాపచారమంటున్న భక్తులు

నిర్మల్‌: చదువులమ్మ కొలువైన బాసరలో అపచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆలయం మూసిన తర్వాత.. అమ్మవారు సేదదీరే సమయంలో అధికార పార్టీకి చెందిన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో తామేం చేస్తే అదే శాసనం.. శాస్త్రమన్నట్లుగా ప్రవర్తించారు. సరస్వతీమాత ప్రాశస్త్యాన్ని, భక్తుల మనోభావాలను ఇక్కడి అధికారులు, పలువురు ధర్మకర్తలు తుంగలో తొక్కుతున్నారు.  
సేదదీరే సమయంలో.. 

బాసర సరస్వతీమాత క్షేత్రంలో శనివారం మధ్యాహ్నం ఆలయం మూసివేసిన తర్వాత (ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు ) అమ్మవారు సేదదీరే సమయంలో ఆలయ ధర్మకర్త నూకం రామారావు, మరో ధర్మకర్త భర్త, పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు కలసి ప్రత్యేక పూజలు చేయించారు. ఇన్‌చార్జి ప్రధాన అర్చకుడు ఈ పూజలు చేశారు.  అమ్మవారు సేదదీరే సమయంలో దర్శనాలను రద్దు చేసి, ఆలయాన్ని మూసి ఉంచుతారు. ఇలాంటి సమయంలో పూజలు చేయడం మహాపాపంగా భావిస్తారు. ప్రధాన ద్వారాన్ని మూసి, పక్క ద్వారం గుండా లోపలికి వెళ్లి పూజలు నిర్వహించడంపై భక్తులు, బాసరవాసులు భగ్గుమంటున్నారు. 

ఆధిపత్యం తమదేనని.. 
అధికార పార్టీ నాయకులుగా, ఆలయ ధర్మకర్తలుగా ఉన్న పలువురు బాసర క్షేత్రంపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఆలయంలో తమదే ఆధిపత్యమన్న ధోరణి తోనే ఇలా అపచారానికి ఒడిగట్టారన్న ఆరోపణలు వ స్తున్నాయి. దేవాదాయ శాఖ అధికారులు సైతం వారికే వత్తాసు పలుకుతుండటంతో వారి పెత్తనానికి అడ్డులేకుండా పోతోందని స్థానికులు పేర్కొంటున్నారు.  

గతంలోనూ అపచారాలు.. 
బాసర ఆలయంలో అపచారాలు ఆనవాయితీగా కొనసాగుతున్నాయి. గతంలో ఆలయానికి వచ్చిన స్పీకర్, మంత్రులకు మర్యాదలు చేసే క్రమంలో అర్చ కులు అమ్మవారికి నైవేద్యాన్ని ఆలస్యంగా పెట్టారు. మరో అర్చకుడు అమ్మవారి ఆభరణాలతోనే గర్భగుడిలో పూజలు చేయించారు. ప్రాతఃకాల పూజలు ఆలస్యం కావడం, అర్చకులు విధులను ఎగ్గొట్టడం సాధారణం గా మారింది. ఆలయ నిర్వహణను పట్టించుకోవాల్సిన అధికారులు బినామీల పేరుతో నిధుల దోపిడీలో మునిగిపోయారు. ఈ క్రమంలో భక్తులు, బాసరవాసులే ఆలయ రక్షణకు ముందుకు వస్తున్నారు. 

విచారణ జరుపుతాం..
సరస్వతీ ఆలయంలో మధ్యాహ్నం సమయంలో పూజలు జరిపినట్లు నా దృష్టికి వచ్చింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కోసారి దర్శనాలకు అనుమతిస్తుంటారు. కానీ ఇలా ప్రత్యేక పూజలు చేయడంపై విచారణ చేపడతాం. తదుపరి చర్యలు తీసుకుంటాం.    
 – సోమయ్య, ఇన్‌చార్జి ఈవో, బాసర

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top