ఇక ఎల్బీనగర్‌ నుంచి పరుగుపెట్టనున్న మెట్రో...

LB nagar - Ameerpet Metro begins on 24th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్బీనగర్‌– అమీర్‌పేట్‌ మెట్రో ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న (సోమవారం) మధ్యాహ్నం 12.15కి ఎల్బీనగర్‌–అమీర్‌పేట మెట్రో రైలు మార్గం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ నరసింహన్‌ హాజరై మెట్రో రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌.రెడ్డిలతో కలసి బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఆహ్వానపత్రం అందించారు. ఇప్పటికే నగరంలో నాగోల్‌– అమీర్‌పేట్‌– మియాపూర్‌ (30 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలో నిత్యం సుమారు 80 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో రద్దీ లక్షకుపైగానే నమోదవుతోంది. ఈ మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది.  

నవంబర్‌లో అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ మెట్రో.. 
అత్యధిక ట్రాఫిక్‌ రద్దీ ఉండే ఎల్బీనగర్‌– అమీర్‌పేట్‌– మియాపూర్‌ (29 కి.మీ) మార్గంలో నిత్యం సుమారు లక్ష మందికి పైగానే మెట్రో జర్నీ చేసే అవకాశం ఉంటుందని హెచ్‌ఎంఆర్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో అమీర్‌పేట్‌– హైటెక్‌సిటీ మార్గంలోనూ మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. జేబీఎస్‌– ఎంజీబీఎస్‌ రూట్లో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నట్లు తెలిపాయి. కాగా ఎంజీబీఎస్‌– ఫలక్‌నుమా (5.5 కి.మీ) మార్గంలో మెట్రో పనులు మరో ఏడాది ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  

పార్కింగ్‌ అవస్థలు తప్పవు.. 
ఎల్బీనగర్‌– అమీర్‌పేట్‌ (16 కి.మీ) మార్గంలో 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్ల వద్ద ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్‌ చేసుకునేందుకు అవసరమైన పార్కింగ్‌ స్థలాలు అందు బాటులో లేవు. దీంతో ప్రయాణికులకు పార్కిం గ్‌ అవస్థలు తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయా స్టేషన్ల వద్ద మెట్రో రైలు దిగిన ప్రయాణికులు తిరిగి సమీప కాలనీలు, బస్తీల్లో ని తమ నివాసాలకు చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్లచేసుకునే పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే మెట్రో చార్జీలు అధికంగా ఉన్నాయని భావిస్తున్న సిటిజన్లకు ఇది అదనపు భారంగా పరిణమించనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top