
పోకిరీని కుమ్మేసిన యువతి
అది భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్. రైలు కోసం ఓ యువతి వేచి చూస్తోంది. ఇదే అదనుగా భావించాడు ఓ పోకిరీ..
అది భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్. రైలు కోసం ఓ యువతి వేచి చూస్తోంది. ఇదే అదనుగా భావించాడు ఓ పోకిరీ.. అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించటమే కాదు... మీద చేయి కూడా వేశాడు. అయితే ఒంటరిగా ఉన్న ఆమె.. ఏమి చేయాలో అర్థం కాలేదు. బాధను మౌనంగా భరించింది. కానీ.. పోకిరి వెకిలి చేష్టలు మాత్రం తగ్గలేదు. దీంతో.. కోపాన్ని తట్టుకోలేకపోయిన ఆమె... అతనికి నాలుగు తగిలించింది.
ఈ ఘటన ఖమ్మం జిల్లా భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్‌లో జరిగింది. రామవరానికి చెందిన ఓ యువతి... హైదరాబాద్ వెళ్లేందుకు.. మణుగూరు ఎక్స్‌ప్రెస్ కోసం వేచి ఉంది. రైల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో మరో రైలు ఎక్కేందుకు ఫ్లాట్ ఫాంపై కూర్చుంది. ఇది గమనించిన ఓ యువకుడు మద్యం మత్తులో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. ఆమెపై చేయి వేశాడు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి.. పోకిరీపై తిరగబడింది. నాలుగు మాటలు అని.. నాలుగు ఉతుకులు ఉతికింది.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కూడా యువతికి మద్దతుగా నిలిచారు. మందుబాబును.. మత్తు దిగేలా చితక్కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లి... రైల్వేస్టేషన్‌కు చేరుకుని.. పోకిరికి నాలుగు తగిలించింది. మద్యం మత్తులో ఉన్న పోకిరీ బాబు... రైల్వే పోలీసులతో కూడా వాదులాటకు దిగాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీస్ బాబాయ్‌లు.. కాళ్లు, చేతులకు పని చెప్పారు.