‘ఉపాధి లేదు కానీ.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు’

Kishan Reddy Fires On Pakistan On Pulwama Incident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మతంతో దేశాన్ని విభజించారని.. పాకిస్థాన్‌లో ఇస్లాం రాజ్యం నడుస్తోందని.. అక్కడ ఉపాధి లేదు కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని బీజేపీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. పుల్వామా ఘటనలో వీర మరణం పొందిన సైనికులకు ఇందిరా పార్కు వద్ద ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి సభకు కిషన్‌రెడ్డి హాజరై పై విధంగా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు యుద్దాలలో ఓడిపోయినా బుద్ధి రాలేదని, భారతదేశాన్ని చీల్చి జమ్మూ కాశ్మీర్‌ను సొంతం చేసుకునేందుకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భద్రతా బలగాలకు అండగా నిలవాల్సిన అవసరముందన్నారు. రాజకీయాలకు, మతాలకతీతంగా ఏకమై నరేంద్రమోదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 

ఎమ్మెల్సీ రామచందర్‌రావు మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా చైనాలాంటి దేశాలు పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని, ప్రజలందరూ మన సైన్యానికి నైతికంగా బలమిస్తే.. తగిన చర్యకు పూనుకుంటారని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన త్యాగమూర్తుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడి ప్రమాదకరమైందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యకు పాల్పడటం మంచి పరిణామం కాదన్నారు. భారతదేశాన్ని ముక్కలు చేసి సమగ్రత, సమైఖ్యతను దెబ్బతీయాలని ఏళ్ల తరబడి పాకిస్థాన్‌ యోచిస్తోందన్నారు. చైనా తప్పా మిగితా దేశాలు పాకిస్థాన్‌ చర్యను ఖండించాయని గుర్తుచేశారు. పాకిస్థాన్‌ను పక్కన పెట్టుకుని చైనా పాత వైరాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. పాకిస్థాన్‌, చైనా దేశాలు ఉగ్రవాదానికి అండగా ఉండటం బాధాకరమని, ఇస్లాం కూడా శాంతినే కోరిందని, ఉగ్రవాదాన్ని మతంతో చూడకూడదన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top