కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ప్రారంభించిన కేసీఆర్‌

Kcr inaugurates New MLA quarters in Hyderguda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదర్‌గూడలో సకల హంగులతో నిర్మితమైన శాసనసభ్యుల నివాస గృహ సముదాయాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రారంభించారు. నిర్మాణంలో తీవ్ర ఆలస్యం జరిగినా ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం రెండో శాసనసభ కొలువుదీరిన తర్వాత ఈ భవనాలు సిద్ధమయ్యాయి. నాలుగున్నర ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దాదాపు రూ.166 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. ఎమ్మెల్యేలతోపాటు సిబ్బంది, సర్వెంట్ల కుటుంబాలు కూడా ఉండేందుకు వీలుగా ఈ సముదాయాన్ని సిద్ధం చేశారు. 119 మంది ఎమ్మెల్యేలతోపాటు మరో నియమిత ఎమ్మెల్యే... వెరసి 120 మంది సభ్యులు ఉండేందుకు వీలుగా వీటిని నిర్మించారు.  

36 స్టాఫ్‌ క్వార్టర్లు: ఆరు అంతస్తుల్లో స్టాఫ్‌ క్వార్టర్లు నిర్మించారు. ఇందులో మొత్తం 36 ఫ్లాట్లు ఉంటాయి. 810 చ.అ. విస్తీర్ణం ఉండే రెండు పడక గదుల ఫ్లాట్లు 12, 615 చ.అ.విస్తీర్ణంలో ఉండే సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లు 24 ఉంటాయి. 12 అటెండెంట్ల ఫ్లాట్లు ఉన్నాయి. ఈ సముదాయం కూడా ఆరు అంతస్తుల్లో ఉంది. ఒక్కో ఫ్లాట్‌ను 325 చ.అ.విస్తీర్ణంలో నిర్మించారు. ఐటీ అండ్‌ ఎమినిటీస్‌ బ్లాక్‌ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇది ఐదు అంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 4 వేల చ.అ.విస్తీర్ణంలో సూపర్‌ మార్కెట్, క్యాంటీన్‌ ఉంటాయి. మొదటి అంతస్తులో కార్యాలయం, హెల్త్‌ సెంటర్‌ ఉంటాయి. సెకండ్‌ ఫ్లోర్‌లో ఆఫీస్, ఇండోర్‌ గేమ్స్, స్టోర్‌ రూమ్‌ ఉంటాయి. 0.73 ఎమ్మెల్డీ సామర్థ్యంతో భూగర్భ సంప్, ఓ ఎస్టీపీ, 1,000 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఉంటాయి. ఇప్పటికే ఉన్న పాత, కొత్త ఎమ్మెల్యే క్వార్టర్లలో ఉండాలనుకుంటున్న ఎమ్మెల్యేలు వాటిల్లోనే కొనసాగే అవకాశముంది.   

12 అంతస్తుల్లో... 
వాహనాలు నిలిపేందుకు సెల్లార్‌లో మూడంతస్తులు నిర్మించారు. ఇందులో 276 కార్లను నిలిపే స్థలం ఉంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 23 విజిటర్స్‌ రూమ్‌లు నిర్మించారు. తమను కలిసేందుకు వచ్చే వారితో ఎమ్మెల్యేలు ఈ గదుల్లో భేటీ అవుతారు. ఓ క్లబ్‌ హౌస్, ఒక వ్యాయామశాల కూడా సిద్ధం చేశారు. ఈ భవనాలు 12 అంతస్తుల్లో నిర్మించారు. ఎమ్మెల్యేలకు 120 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కోటి 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో మూడు పడక గదులు, హాలు, వంటగది, డ్రాయింగ్‌రూమ్, విజిటర్‌ రూమ్‌ ఉంటాయి. ఆరు లిఫ్టులు, 5 మెట్ల దారులు ఏర్పాటు చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top