చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పాను: కేకే

K Keshava Rao Comments About TSRTC Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కేసీఆర్‌ చర్చల ప్రసక్తే లేదంటూ ప్రకటిస్తే..  ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు చర్చలకు సిద్ధంకండంటూ పత్రికా ప్రకటన విడుదల చేసి సంచలనం సృష్టించారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో తాజాగా కేకే మాట మార్చారు. కార్మికులతో చర్చలు జరపడానికి తనకు ఎలాంటి అధికారం లేదన్నారు. ఇది ప్రభుత్వ సమస్య అని... పార్టీ సమస్య కాదని తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితులు చేజారుతున్నాయని.. ప్రభుత్వం, కార్మికులు పరస్పరం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మాత్రమే తాను సూచించానన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతానని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. అయితే మంచి జరుగుతుందనుకుంటే.. మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమే అన్నారు. కార్మికులు తనతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉండటం మంచి పరిణామంగా పేర్కొన్నారు కేశవరావు.
(చదవండి: ‘ప్రభుత్వం చర్చలకు పిలుస్తే మేము సిద్ధం’)

అయితే ప్రభుత్వం తరఫున చర్చలు జరిపేందుకు తనకు ఎలాంటి అనుమతి రాలేదని కేకే స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. అయితే సీఎం ఇంకా తనకు అందుబాటులోకి రాలేదన్నారు. తాను సోషలిస్టునని.. రాజ్యం వైపు కాక కార్మికుల వైపే ఉంటానని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు కొట్టుకోకుండా కలసికట్టుగా ఉండాలని కేకే సూచించారు. ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తానంటే తనకేమి అభ్యంతరం లేదన్నారు. అయితే ఆర్టీసీ విలీనం సాధ్యపడకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని కేకే స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటనేది తనకు తెలియదని.. ఒకవేళ తెలిస్తే.. సమస్య పరిష్కారం అయ్యేదన్నారు కేశవరావు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top