ప్రొఫెసర్‌ కాశిం విడుదల కోసం లేఖ

Judge For The Release Of Professor Kasim The Poets Who Wrote The Letter - Sakshi

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన కవులు, రచయితలు

సాక్షి, హైదరాబాద్‌: పోలీసులు అరెస్టు చేసిన విప్లవ రచయితల సంఘం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కాశిం విడుదలకు ఆదేశించాలని కోరుతూ వందమంది కవులు, రచయితలు, ప్రజాస్వామిక వాదులు, జర్నలిస్టులు బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సమాజంలో భిన్నభావాలు కలిగి ఉండటం ప్రజాస్వామ్యానికి చిహ్నమని, ప్రస్తుతం దేశం లో, రాష్ట్రంలో పాలకుల భావాలను వ్యతిరేకిస్తేనే నేరంగా పరిగణిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ నెల 18న ప్రొఫెసర్‌ కాశిం ఇంటి మీద పోలీసులు దాడిచేసి నిర్బంధంలోకి తీసుకున్న సంగతి మీకు తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థి దశ నుంచి పోరాటాల్లో పాల్గొన్నారు.

కవిగా, రచయితగా, విమర్శకుడిగా, పత్రిక సంపాదకుడిగా, ప్రొఫెసర్‌గా ఎదిగారు. విరసం కార్యదర్శిగా వారం రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ప్రశ్నిస్తున్న ఆలోచనాపరులపై కేసులు బనాయించా రు. ఈ క్రమం తెలంగాణ రాష్ట్రంలోనూ కొనసాగడం అభ్యంతరకరంగా ఉంది ’అని వారు ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. క్లాస్‌ రూంలో పాఠాలు చెబుతున్న కాశిం పరారీలో ఉన్నట్లు చెబుతున్న పోలీసులు 2016 కేసులో ఇప్పుడు అరెస్ట్‌ చేయడాన్ని రాజకీయ కుట్రగా తాము భావిస్తున్నామన్నారు.

వర్ధమాన కవు లు, రచయితలపైన, సృజనకారులపైన భవిష్యత్తులో ఎలాంటి నిర్బంధం కొనసాగించకుండా చర్యలు తీసుకోవాల ని సీజేను కోరారు. సీనియర్‌ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర్లు, ఏబీకేప్రసాద్, కె.శ్రీనివాస్, ఎస్‌.వీర య్య, దిలీప్‌రెడ్డి.. కవులు, రచయితలు, చెరుకు సుధాకర్, కె.శివారెడ్డి, దేవిప్రియ, నిఖిలేశ్వర్, ఓల్గా, ప్రొ.జయధీర్‌ తిరుమల్‌ రావు, ప్రొ. జి.హరగోపాల్, ప్రొ.కాత్యాయని విద్మహే, అంపశయ్య నవీన్, చుక్క రామయ్య, కుప్పిలి పద్మ, మెర్సీ మెర్గరేట్, సత్యవతి కొండవీటి, వేనెపల్లి పాండురంగారావు, అక్కినేని కుటుంబరావు తదితరులు సంతకం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top